బెంగళూరు: బెంగళూరు సామూహిక అత్యాచార కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 19 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేసిన పోలీసులకు, నిందితులు మరెంతో మంది యువతులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.
నిందితులు నిఖిల్, డిక్సన్ సాండ్రాలు అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లు సమాచారం. యువతులను ట్రాప్ చేయడానికి వీరి ముఠాలో మరికొంత మంది యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు బెంగళూరులోని ప్రముఖ కాలేజీల్లో చదివే సంపన్న యువతులతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయం స్నేహంగా మారిన తర్వాత, జక్కూరులోని ఒక విల్లాలో నిఖిల్ ఏర్పాటు చేసే పార్టీలకు వారిని తీసుకువస్తారు. అక్కడ వారికి మద్యం, మత్తుమందులు ఇచ్చి అత్యాచారానికి పాల్పడతారు. ఆ తర్వాత అది మత్తులో జరిగిన పొరపాటుగా నమ్మబలుకుతారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది యువతులు బయటకు చెప్పలేదు. కానీ ఒక 19 ఏళ్ల యువతి ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ దారుణాల పరంపర వెలుగులోకి వచ్చింది.
వ్యాపారం ముసుగులో దారుణాలు సకలేశ్పురానికి చెందిన నిఖిల్ ఈ ముఠాకు సూత్రధారి. అతని అనుచరుడు, పశ్చిమ బెంగాల్కు చెందిన డిక్సన్ సాండ్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బసవేశ్వర నగర్లో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ మరియు కార్ వాషింగ్ సెంటర్ నడుపుతున్న నిఖిల్, ఆ వ్యాపారం ముసుగులో ఈ అక్రమాలకు పాల్పడేవాడు. పార్టీకి వచ్చే యువతులకు మత్తుమందులు కలిపిన పానీయాలు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడేవారు. ఈ పార్టీలు జరిగిన విల్లా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి చెందినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
19కి చేరిన బాధితుల సంఖ్య ఈ కేసు బయటపడటంతో తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని దాదాపు 19 మంది యువతులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అమృతహళ్లి పోలీసులు వీరి స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. కేవలం లైంగిక వేధింపులే కాకుండా, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేయకుండా అడ్డుకోవడానికి నిఖిల్ ఆమెపై తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు, కానీ పోలీసులు అది ఫేక్ అని తేల్చేశారు. ఆ తప్పుడు ఫిర్యాదు వెనుక విల్లా యజమాని అయిన అధికారి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
