న్యూఢిల్లీ: బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ ఇటీవల 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ మరియు అప్పుల కేసులో తీహార్ జైలు నుండి మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. సోనూ సూద్ తన గురించి “పని ఇప్పించండి” అని చేసిన వ్యాఖ్యలపై రాజ్‌పాల్ యాదవ్ అసహనం వ్యక్తం చేయగా, తాజాగా సోనూ సూద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది?
రాజ్‌పాల్ యాదవ్ జైలులో ఉన్నప్పుడు సోనూ సూద్ ఆయనకు అండగా నిలిచారు. చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు రాజ్‌పాల్ యాదవ్‌కు పని ఇచ్చి, కొంత అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి గౌరవించాలని సోనూ సూద్ సోషల్ మీడియాలో కోరారు. అయితే, దీనిపై రాజ్‌పాల్ యాదవ్ మండిపడ్డారు.
రాజ్‌పాల్ యాదవ్ స్పందన: “నాకు పని అడగాల్సిన అవసరం ఉందని ఎవరూ అనుకోవద్దు. పని అడగడంలో తప్పు లేదు కానీ, నాకు పనికి కొదవ లేదు. రాబోయే 7 ఏళ్లలో నా దగ్గర 1200 కోట్ల రూపాయల బ్రాండింగ్ ప్రాజెక్టులు, 10 సినిమాలు ఉన్నాయి. నేను 1500 కోట్ల రూపాయల విలువైన మనిషిని” అంటూ ఘాటుగా స్పందించారు.
సోనూ సూద్ వివరణ: రాజ్‌పాల్ వ్యాఖ్యలపై సోనూ సూద్ స్పందిస్తూ.. “ఆయన బెయిల్ మీద రావడం నాకు సంతోషం. ఆయనకు పని కావాలని నేను ఎప్పుడూ అనలేదు. ఆయన చాలా ప్రతిభావంతుడు, అందుకే ఆయనకు సినిమాలు ఇచ్చి, అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వండి.. అది ఆయనకు ఇచ్చే గౌరవం అని మాత్రమే అన్నాను. ఇది చారిటీ కాదు, ఆయన అర్హతకు ఇచ్చే విలువ” అని స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం:
2010లో రాజ్‌పాల్ యాదవ్ తన సొంత సినిమా ‘అతా-పతా లాపతా’ కోసం 5 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. సినిమా ప్లాప్ కావడంతో ఆ డబ్బు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్చి 18 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది.

Leave a Reply