UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 ఫలితాలను మార్చి 6, 2026న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఉదంతం వెలుగులోకి వచ్చింది. “ఒకవేళ భర్త 20 కోట్ల ఆస్తికి యజమాని అయి ఉండి, భార్య ఎటువంటి సరైన కారణం లేకుండా విడాకులు తీసుకుంటే, ఆమెకు ఎంత మెయింటెనెన్స్ (భరణం) లభించాలి?”
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాకు చెందిన రూపల్ జైస్వాల్‌ను UPSC బోర్డు ఈ క్లిష్టమైన ప్రశ్న అడిగింది. తన మేధస్సుతో, సమతుల్య దృక్పథంతో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. వకాల్తా వదిలి IAS కావాలనే కల కన్న రూపల్, ఆల్ ఇండియా 43వ ర్యాంక్ సాధించారు.
వకాల్తా వదిలి పరిపాలనా సేవ వైపు..
బిల్డింగ్ కాంట్రాక్టర్ ధనంజయ్ జైస్వాల్ కుమార్తె రూపల్, న్యాయశాస్త్రం (Law) చదివినప్పటికీ ఆమె లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్. మొదటి ప్రయత్నంలో విఫలమైనా పట్టు వదలకుండా, రెండో ప్రయత్నంలో 512వ ర్యాంక్ సాధించారు. అయినప్పటికీ సంతృప్తి చెందక, మూడో ప్రయత్నంలో తన కలను నెరవేర్చుకున్నారు. ఆమె రోజుకు 8 గంటలు చదువుతూ, NCERT పుస్తకాలు మరియు టెస్ట్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు.
UPSC ఇంటర్వ్యూ: విడాకులపై ఆ ఆసక్తికరమైన ప్రశ్న
ఇంటర్వ్యూలో బోర్డు అడిగిన ప్రశ్న: “భర్తకు 20 కోట్ల ఆస్తి ఉండి, భార్య బలమైన కారణం లేకుండా విడాకులు కోరితే ఎంత భరణం ఇవ్వాలి?”
దీనికి రూపల్ ఎంతో పరిణతితో సమాధానమిస్తూ.. “ఆ మహిళ ఉద్యోగం చేస్తోందా లేదా? పిల్లల కస్టడీ ఎవరి దగ్గర ఉంది? అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది” అని చెప్పారు. బోర్డు ఒక నిర్దిష్ట అంకెను అడగగా, ఆమె 10% అని సూచించారు. “50% ఎందుకు ఇవ్వకూడదు?” అని బోర్డు తిరిగి ప్రశ్నించగా, రూపల్ ఇచ్చిన సమాధానం ప్రశంసనీయం.
“మెయింటెనెన్స్ ఉద్దేశ్యం భర్తను శిక్షించడం కాదు, భార్య తన ప్రాథమిక అవసరాలను తీర్చుకుంటూ గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కొనసాగించేలా చేయడమే.” ఆమె సమతుల్య సమాధానానికి ఇంటర్వ్యూ బోర్డు ఫిదా అయింది.
మహిళా సాధికారతపై స్పష్టమైన ఆలోచనలు
పురుషులు మహిళలను గౌరవించడం నేర్చుకున్నప్పుడే మహిళా భద్రత సాధ్యమని రూపల్ నమ్ముతారు. పాఠ్యపుస్తకాల్లో మహిళలను కేవలం వంటగదికే పరిమితం చేసే చిత్రాలను తొలగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌గా మహిళల మరియు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
కుటుంబ సహకారం
రూపల్ విజయంలో ఆమె కుటుంబం వెన్నంటి నిలిచింది. ఆమె సమయం వృధా కాకుండా తమ్ముడు నోట్స్ మరియు ఫోటోకాపీలు తెచ్చి ఇచ్చేవాడు. తల్లి ఇంటి పనుల నుండి ఆమెకు విముక్తి కల్పించి చదువుకోమని ప్రోత్సహించగా, తండ్రి కొడుకులాగే అన్ని విధాలా అండగా నిలిచారు.

Leave a Reply