జీవితకాల సంపాదన.. చివరి నిమిషంలో గంగపాలు! వారసత్వ రాజకీయాల విరోధి నితీష్‌పై పుత్రవాత్సల్య ముద్ర?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయాల్లో వారసత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా పేరు పొందారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఆయన చేసే విమర్శలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటాయి. తన ఆదర్శ నాయకుడు కర్పూరీ ఠాకూర్ వలె, నితీష్ కూడా తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతారని అందరూ భావించారు. కానీ, తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడంతో నితీష్ తన పాత సూత్రాలను తుంగలో తొక్కారనే విమర్శలు వ్యూక్తమవుతున్నాయి.

శనివారం నిశాంత్ కుమార్ అధికారికంగా జేడీయూ (JD-U) సభ్యత్వం స్వీకరించారు. నితీష్ రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవ్వడం, అదే సమయంలో కుమారుడికి రాజకీయ ప్రవేశం కల్పించడంతో విరోధులు ఆయనపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. కొడుకుపై ఉన్న మోహంతో నితీష్ తన జీవితకాల సంపాదనను (నైతిక విలువలు) ఒక్క క్షణంలో కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వారసత్వానికి వ్యతిరేకిగా నితీష్: గతంలో కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలను నితీష్ “కుటుంబ పార్టీలు” అని ఎద్దేవా చేసేవారు. “రాజకీయ కుటుంబాల్లో జన్మించిన వారే పాలించడానికి అర్హులు అనుకోవడం ప్రజాస్వామ్యానికి హానికరం” అని ఆయన 2017లో బలంగా వాదించారు.

లాలూ కుటుంబంపై విమర్శలు: తేజస్వి యాదవ్ రాజకీయ ఎదుగుదలపై స్పందిస్తూ, నేటి యువత తమ సామర్థ్యంతో కాకుండా కుటుంబం అండతో ముందుకు వస్తున్నారని నితీష్ విమర్శించారు. 2024 జనవరిలో కూడా కర్పూరీ ఠాకూర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. తాను తన కుటుంబాన్ని ప్రమోట్ చేయలేదని గర్వంగా చెప్పుకున్నారు.

మారుతున్న సమీకరణాలు: గత ఏడాది కాలంగా నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నా నితీష్ మౌనం వహించారు. అయితే, జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా మరియు ఎంపీ లలన్ సింగ్ వంటి నేతలు నిశాంత్‌ను ఆహ్వానించడంతో నితీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Posted

in

by

Tags: