చైనాకు చెందిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి కళ్లను చెమర్చులా చేస్తోంది. 4 ఏళ్ల వయసులో రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 28 ఏళ్ల ‘జాంగ్ యున్పెంగ్’, పాతికేళ్ల తర్వాత ఏడు సముద్రాలు దాటి వచ్చి తన కన్నతండ్రిని కలుసుకున్నాడు.
అసలేం జరిగింది?
తప్పిపోయిన క్షణం: 2001లో జాంగ్ వయసు కేవలం 4 ఏళ్లు. చైనాలోని షెన్యాంగ్ రైల్వే స్టేషన్లో అతని బాబాయ్ ఐస్‌క్రీం తీసుకురావడానికి జాంగ్‌ను కాసేపు అక్కడే వదిలి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బాబు అక్కడ లేడు. పోలీసులు అతడిని ఒక వెల్ఫేర్ సెంటర్‌కు తరలించి, పేరు మార్చారు.
దత్తత తీసుకున్నవారూ వదిలేశారు: 2005లో ఒక కెనడియన్ జంట జాంగ్‌ను దత్తత తీసుకుని కెనడాకు తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ మూడు నెలలకే ఆ జంట విడాకులు తీసుకుంది. ఇద్దరూ జాంగ్ బాధ్యతను తీసుకోకపోవడంతో, అతడిని మరో కుటుంబానికి పంపారు. అక్కడ ప్రేమ, సరైన సంరక్షణ కరువై హైస్కూల్ తర్వాత తన పొట్ట కూటి కోసం తనే పని చేసుకోవాల్సి వచ్చింది.
కన్నతండ్రి ఆచూకీ దొరికిందిలా..
గతేడాది సోషల్ మీడియాలో తప్పిపోయిన కుటుంబాలు కలుసుకున్న కథనాలను చూసిన జాంగ్, తన మూలాలను వెతకాలని నిర్ణయించుకున్నాడు.
సహాయం: ‘బేబీ రిటర్నింగ్ హోమ్’ అనే సంస్థను సంప్రదించగా, ఒక చైనీస్ విద్యార్థి అతడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
డీఎన్ఏ పరీక్ష: జాంగ్ డీఎన్ఏ శాంపిల్‌ను చైనా నేషనల్ డేటాబేస్‌తో పోల్చి చూడగా, కొన్ని రోజుల్లోనే అతని తండ్రి ‘జాంగ్ జియుచెంగ్’ ఆచూకీ దొరికింది.
పునఃకలయిక: మార్చి 2, 2026న జిలిన్ ప్రాంతంలో తండ్రీకొడుకులు కలుసుకున్నప్పుడు వారిద్దరూ భోరున విలపించారు. తండ్రి తన కొడుకును కలవడానికి ముందే 10,000 యువాన్లను పంపారు. గతంలో కోల్పోయిన కాలాన్ని భర్తీ చేస్తానని, తన కొడుకుకు అన్ని సుఖాలు అందిస్తానని ఆయన కన్నీళ్లతో చెప్పారు.
