అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు ముదిరిన వేళ, ఒకవేళ అణు యుద్ధం గనుక సంభవిస్తే ప్రపంచం ఎదుర్కోబోయే వినాశనం గురించి విస్తుపోయే పరిశోధన వివరాలు బయటపడ్డాయి.
ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్’ (Nature) ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 12,000 అణు క్షిపణులను ఉపయోగిస్తే, సుమారు 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని మరియు భూమి అంతటా ‘న్యూక్లియర్ వింటర్’ (Nuclear Winter) ఏర్పడుతుందని హెచ్చరించింది.
అసలేం జరుగుతుంది?
- భీకర ఉష్ణోగ్రత: అణు విస్ఫోటనాల వల్ల కలిగే మంటలు సుమారు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వేడిని విడుదల చేస్తాయి. దీనివల్ల నగరాలు, అడవులు కాలి బూడిదవుతాయి.
- చీకటి సామ్రాజ్యం: విస్ఫోటనాల నుండి వెలువడే 150 మిలియన్ టన్నుల నల్లటి పొగ మరియు ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తాయి. ఇవి ఓజోన్ పొరను దెబ్బతీసి, సూర్యరశ్మి భూమిని చేరకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా వచ్చే 10 ఏళ్ల పాటు భూమి చీకటిలో మునిగిపోయి, నిరంతరం మంచు కురుస్తుంది.
బతికి బట్టకట్టే ఆ రెండు దేశాలు: ఈ గడ్డకట్టే చలిలో, రేడియేషన్ ప్రభావం నుండి తప్పించుకుని మనుషులు జీవించడానికి అనువైన ప్రాంతాలుగా ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ మాత్రమే మిగులుతాయని నిపుణులు భావిస్తున్నారు. భౌగోళికంగా ఇవి ఇతర దేశాలకు దూరంగా ఉండటం, సముద్ర వాతావరణం వల్ల అక్కడ వ్యవసాయం కొంతవరకు సాధ్యమవుతుందని అంచనా. అయినప్పటికీ, అక్కడి ప్రజలు కూడా రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి భూగర్భ గదుల్లోనే ఆశ్రయం పొందాల్సి ఉంటుంది.
ఆహార సంక్షోభం మరియు వినాశనం: సూర్యరశ్మి లేకపోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోయి పంటలన్నీ ఎండిపోతాయి. ఉక్రెయిన్, అమెరికా వంటి ప్రపంచ ‘ధాన్యపు భాండాగారాలు’ మంచు ఎడారులుగా మారుతాయి. వర్షపాతం 90 శాతం తగ్గిపోయి తీవ్ర కరువు ఏర్పడుతుంది. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో సూర్యకాంతి నేరుగా పడి చర్మ క్యాన్సర్, కంటిచూపు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలే కాకుండా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-తైవాన్ వివాదాలు ప్రపంచాన్ని వినాశనం అంచుకు తీసుకెళ్తున్నాయి. న్యూక్లియర్ వింటర్ సమయంలో ఖండాల లోపలి ఉష్ణోగ్రతలు -20°C నుండి -30°C కి పడిపోయి మొత్తం జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
