ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో భీకర మలుపు తీసుకుంది. ఇప్పటివరకు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చి మొదటిసారిగా బహ్రెయిన్‌లోని నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.
యుద్ధం నేపథ్యం:
మార్చి 7న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ దక్షిణ భాగంలోని ‘కేశమ్’ ద్వీపంలో ఉన్న వాటర్ ప్లాంట్‌పై దాడి చేశాయి. దీనివల్ల 30 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు బహ్రెయిన్‌లోని ప్లాంట్‌పై ద్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గల్ఫ్ దేశాలు తమ తాగునీటి అవసరాల కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసే ఈ ప్లాంట్లపైనే 90% పైగా ఆధారపడతాయి. ఇప్పుడు ఈ ప్లాంట్లపై దాడులు జరగడం వల్ల తీవ్రమైన జల సంక్షేమం తలెత్తే ప్రమాదం ఉంది.
నీటి కోసం యుద్ధం (Water for Water):
పౌర సదుపాయాలపై దాడి చేయడం అమెరికా చేసిన పెద్ద నేరమని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ మండిపడ్డారు. దీనికి బదులుగా ఇరాన్ తొలుత బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళ స్థావరంపై, ఆ తర్వాత జుఫైర్లోని వాటర్ ప్లాంట్‌పై దాడులు చేసింది. గతంలో దుబాయ్‌లోని జెబెల్ అలీ వంటి ఇంధన కేంద్రాల దగ్గర దాడులు జరిగినప్పటికీ, నేరుగా వాటర్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి.
గల్ఫ్ దేశాల బలహీనత:
గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ మరియు ఒమన్ ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాలు. ఇక్కడ సహజ నీటి వనరులు తక్కువ.
- ప్రపంచంలోని సముద్రపు నీటి శుద్ధీకరణ సామర్థ్యంలో 60% అరబ్ దేశాల్లోనే ఉంది.
- GCC దేశాల్లో 400 పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి రోజుకు 68 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తాయి.
ఏ దేశం ఎంత ఆధారపడుతోంది?
| దేశం | నీటి శుద్ధీకరణపై ఆధారపడటం (%) |
| కువైట్ | 99% |
| ఖతార్ | 99% |
| బహ్రెయిన్ | 97% |
| యూఏఈ | 95% |
| సౌదీ అరేబియా | 70% |
