భారత స్టాక్ మార్కెట్ నేడు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ పతనాన్ని మూటగట్టుకుంది. సోమవారం (మార్చి 9) ఉదయం మార్కెట్ గంట మోగగానే మిడిల్ ఈస్ట్ యుద్ధం మరియు గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీనితో సెన్సెక్స్-నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోయాయి.
గత వారం నష్టాల తర్వాత ఇన్వెస్టర్లు ఈరోజు కొంత కోలుకుంటామని ఆశించినప్పటికీ, ప్రీ-ఓపెన్ సెషన్ నుండే విక్రయాల జోరు కొనసాగింది. ఉదయం 9:19 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) దాదాపు 2,327 పాయింట్లు (2.95%) కోల్పోయి 76,591.35 స్థాయికి పడిపోయింది. అలాగే నిఫ్టీ 50 (Nifty) కూడా 701 పాయింట్లు (2.87%) తగ్గి 23,748.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
- మధ్యప్రాచ్య యుద్ధం: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించాయి. దీనివల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది.
- విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ (FIIs): విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుండి పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. గత వారంలోనే దాదాపు 23,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు.
- గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రిస్క్ మరియు అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా మార్చుకోవడానికి నిధులను విత్ డ్రా చేసుకుంటున్నారు.
