అద్దె ఇళ్లలో ఉంటున్నారా? మీకు శుభవార్త.. కేంద్రం కొత్త అద్దె నిబంధనలు! ఇవి తప్పక నోట్ చేసుకోండి.

సొంత ఇల్లు అనేది చాలా మందికి జీవితకాల కల అయినప్పటికీ, నగరాల్లో నివసించే లక్షలాది మందికి ‘అద్దె ఇల్లే’ ఏకైక మార్గం. అయితే అద్దె ఇల్లు అనగానే ఇంటి యజమాని – అద్దెదారు మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. వీటికి ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వం కొత్త అద్దె చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇకపై యజమాని తన ఇష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేరు, అలాగే ‘అడ్వాన్స్’ పేరుతో మీ జేబులు ఖాళీ చేయలేరు. ఈ కొత్త చట్టంలోని ముఖ్య అంశాలు ఇవే:

  1. అడ్వాన్స్ ఇక ‘రెండు నెలలే’!
    కొత్త నిబంధనల ప్రకారం, ఇంటి యజమానులు గరిష్టంగా రెండు నెలల అద్దెను మాత్రమే అడ్వాన్స్ (Security Deposit) గా తీసుకోవాలి. 10 నెలల అడ్వాన్స్ అడిగి అద్దెదారులను భయపెట్టే రోజులకు ఇక చెక్ పడినట్లే.
  2. 60 రోజుల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్
    అద్దె ఒప్పందాలు (Rental Agreements) ఇకపై కేవలం కాగితాలకే పరిమితం కావు. ఒప్పందం కుదిరిన 60 రోజుల్లోపు వాటిని డిజిటల్ పద్ధతిలో రిజిస్టర్ చేయాలి. ఇది ఇరు పక్షాలకు చట్టపరమైన రక్షణను ఇస్తుంది.
  3. ‘హఠాత్తుగా’ అద్దె పెంచడం కుదరదు
    ఏడాదికి ఒకసారి మాత్రమే అద్దె పెంచే అవకాశం ఉంటుంది. అది కూడా అద్దె పెంచడానికి 90 రోజుల ముందే (3 నెలలు) అద్దెదారుకు నోటీసు ఇవ్వడం తప్పనిసరి.
  4. అనుమతి లేకుండా ఇంట్లోకి రావడానికి వీల్లేదు!
    “నా ఇల్లు, నేను ఎప్పుడైనా వస్తాను” అని యజమానులు ఇకపై అత్తెమీరలేరు. అత్యవసర పనుల నిమిత్తం లేదా ఇల్లు చూడటానికి రావాలంటే కనీసం 24 గంటల ముందే అద్దెదారుకు సమాచారం ఇవ్వాలి.
  5. మరమ్మతు పనుల బాధ్యత
    ఇంట్లో ఏవైనా ముఖ్యమైన మరమ్మతులు ఉంటే, యజమానిని కోరిన 30 రోజుల్లోపు ఆయన స్పందించకపోతే, అద్దెదారులే స్వయంగా బాగు చేయించుకోవచ్చు. ఆ ఖర్చును నెలవారీ అద్దెలో తగ్గించుకునే అవకాశం చట్టంలో ఉంది.
  6. బలవంతంగా ఖాళీ చేయించడం నేరం!
    సరైన చట్టపరమైన పద్ధతులు పాటించకుండా ఏ అద్దెదారును ఇంటి నుండి బయటకు పంపలేరు. విద్యుత్ లేదా నీటి కనెక్షన్ కట్ చేయడం, ఇంటికి తాళం మార్చడం వంటి చర్యలకు పాల్పడితే అది శిక్షార్హమైన నేరం అవుతుంది.

యజమానుల ఆందోళన
ఈ కొత్త నిబంధనలు అద్దెదారులకు సంతోషాన్నిచ్చినా, ఇంటి యజమానులలో కొన్ని ఆందోళనలను రేకెత్తించాయి. అడ్వాన్స్‌ను రెండు నెలలకే పరిమితం చేయడం వల్ల, ఒకవేళ అద్దెదారు ఇల్లు పాడుచేసినా లేదా అద్దె కట్టకుండా వెళ్లిపోయినా ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల యజమానులు ఇకపై అద్దెకు ఇచ్చే ముందే అద్దెదారుల నేపథ్యాన్ని (Background Check) మరింత కఠినంగా తనిఖీ చేసే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: