ఇరాన్‌తో యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలు మరియు ఇరాన్ అంతర్గత రాజకీయ పరిణామాల మధ్య ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. మరోవైపు, దివంగత అయతోల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మెజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమించారు.
“లక్ష్యం దాదాపు పూర్తి”:
సిబిఎస్ (CBS) న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ యుద్ధం “చాలా పరిపూర్ణంగా” ముగిసిందని వర్ణించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మేము మా సైనిక లక్ష్యాలను పూర్తి చేయడంలో భారీ పురోగతి సాధించాము. కొందరు ఇది ఇప్పటికే పూర్తయిందని కూడా అనవచ్చు. ఇరాన్‌లోని ప్రతి సైనిక శక్తిని మేము చాలా పూర్తిగా తుడిచిపెట్టాము” అని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా తాను ఈ అంశంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
ఇరాన్‌లోని 5000 లక్ష్యాలపై అమెరికా దాడులు:
ఈ సైనిక చర్య గురించి ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. ఒకవైపు దీనిని “స్వల్పకాలిక పర్యటన” (Short-term excursion) అని వర్ణిస్తూనే, మరోవైపు “అంతిమ విజయం సాధించే వరకు మరింత పట్టుదలతో ముందుకు సాగుతాం” అని ప్రతిజ్ఞ చేశారు.
అమెరికా సైన్యం ఇరాన్ వ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసిందని ట్రంప్ చెప్పారు.
“మేము వారి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మరియు ఇతర కీలక వ్యవస్థలను దెబ్బతీశాము. వాటిని మళ్లీ నిర్మించుకోవడానికి వారికి చాలా సంవత్సరాలు పడుతుంది” అని ఆయన హెచ్చరించారు.
అయితే, కొన్ని అత్యంత కీలకమైన లక్ష్యాలను ప్రస్తుతం తాము తాకలేదని ఆయన వెల్లడించారు.
“వారు అతి తెలివి ప్రదర్శించవద్దు”:
ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేస్తూ.. “వారు ఏదైనా అతి తెలివి (Cute) ప్రదర్శించడానికి ప్రయత్నించకపోవడమే మంచిది” అని ట్రంప్ అన్నారు. గతంలో ఓమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల గురించి వివరిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికే మొగ్గు చూపిందని, అందుకే చర్చలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు.
“ఒకవేళ మేము గత వేసవిలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయకపోయి ఉంటే, వారు ఇప్పటికే అణ్వాయుధాలను తయారు చేసేవారు. వాటిని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండా పోయేది” అని ట్రంప్ పేర్కొన్నారు.
