టెహ్రాన్: ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పోరు ఇప్పుడు ఆర్థిక మూలాల వైపు మళ్లింది. ఇరాన్‌లోని కీలక ప్రభుత్వ రంగ బ్యాంకుపై జరిగిన దాడికి ప్రతికారంగా.. అరబ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ సంచలన హెచ్చరిక జారీ చేసింది.
ఇరాన్ బ్యాంక్ ‘సెపా’పై దాడి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ‘బ్యాంక్ సెపా’ (Bank Sepah) పై నిన్న భీకర దాడి జరిగింది.
ప్రాముఖ్యత: ఇది ఇరాన్ సైన్యానికి అత్యంత సన్నిహితంగా పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇక్కడి నుండే సైనిక ఆయుధాల కొనుగోలుకు నిధులు అందుతాయని సమాచారం.
నష్టం: ఈ దాడిలో బ్యాంకుకు అనుబంధంగా ఉన్న పరిపాలనా భవనం భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అరబ్ దేశాలకు ఇరాన్ సీరియస్ వార్నింగ్
బ్యాంకుపై దాడితో రగిలిపోతున్న ఇరాన్, టెహ్రాన్‌లోని తన సైనిక ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి ద్వారా అరబ్ దేశాలకు హెచ్చరికలు పంపింది:
ఆర్థిక సంస్థలే లక్ష్యం: మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న అన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లే మా తదుపరి టార్గెట్.
ప్రజలకు హెచ్చరిక: “అమెరికా ఉగ్రవాద సైన్యం మరియు ఇజ్రాయెల్ క్రూర పాలన మా బ్యాంకుపై చట్టవిరుద్ధంగా దాడి చేశాయి. అందుకే మేము ప్రతిదాడికి సిద్ధమయ్యాం. అరబ్ దేశాల్లోని ప్రజలు ఆయా బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు కనీసం 1,000 మీటర్ల దూరంలో ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.
ముదురుతున్న యుద్ధం
ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇప్పుడు నేరుగా ఆర్థిక వ్యవస్థలపై దాడి చేస్తామని హెచ్చరించడం అరబ్ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. అమెరికా కూడా ఇరాన్‌పై తన దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
