ఢిల్లీ: ఇరాన్ ‘హర్ముజ్ జలసంధి’ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు (Crude Oil) మరియు గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ ప్రభావం మన దేశంపై కూడా పడింది. అయితే, ఇటువంటి క్లిష్ట సమయంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మాల్దీవులు సహాయం కోసం భారత్‌ను వేడుకుంటున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారత్, చైనాతో సహా అనేక దేశాలకు ఇంధన సరఫరా జరిగే కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నేటికి యుద్ధం ప్రారంభమై 14 రోజులు కావస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల వద్ద కొంతమేర చమురు నిల్వలు ఉన్నప్పటికీ, యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఇంధన సంక్షోభం తప్పదు.
సహాయం కోరుతున్న మూడు దేశాలు
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధృవీకరించారు. “మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా దెబ్బతింది. దీంతో శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు భారత్ సహాయాన్ని కోరుతున్నాయి. బంగ్లాదేశ్‌కు ఇప్పటికే డీజిల్ సరఫరా చేశాం, వారు మరిన్ని ఇంధన నిల్వలను అడుగుతున్నారు” అని ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్‌కు డీజిల్: భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్‌కు 5,000 టన్నుల డీజిల్ను అందజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం, భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా ఈ సరఫరా జరిగింది. ఇప్పుడు వారు అదనపు డీజిల్ కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీలంక రాయబారాలు: ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొరత లేనప్పటికీ, భవిష్యత్తులో రాబోయే ముప్పును ఊహించి ఆ దేశం భారత్ మరియు చైనాతో ముందస్తు చర్చలు జరుపుతోంది.
మాల్దీవుల అభ్యర్థన: మాల్దీవులలో అప్పుడే చమురు సమస్య మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ మిత్రదేశాలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భారత్ సహాయం కోసం అభ్యర్థించారు.
భారత్‌పైనే ఎందుకు ఆధారపడుతున్నాయి?
శ్రీలంక, మాల్దీవుల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంత బాగాలేదు. వారి వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Foreign Exchange Reserves) కూడా తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే ఆ దేశాలు తట్టుకోలేవు. భారత్ అయితే మిత్రదేశం కాబట్టి, ఇంధనాన్ని ఇప్పుడు తీసుకొని తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉంటుందని వారు భావిస్తున్నారు.
మిత్రత్వం + శత్రుత్వం మధ్య ఊగిసలాట
ఈ మూడు దేశాలు భారత్‌కు పొరుగు దేశాలే అయినప్పటికీ, గత కొంతకాలంగా వీరి వైఖరిలో మార్పులు వచ్చాయి.
బంగ్లాదేశ్: గతంలో పాకిస్థాన్‌తో కలిసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసింది, కానీ ఇప్పుడు పరిస్థితి మారడంతో శాంతించింది.
మాల్దీవులు: ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్‌కు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు.
శ్రీలంక: భారత్ ఎంత సహాయం చేసినా, శ్రీలంక అప్పుడప్పుడు చైనా నౌకలకు అనుమతినిస్తూ, పాకిస్థాన్‌తో కలిసి సైనిక విన్యాసాలకు ప్లాన్ చేస్తూ భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది. అలాగే తమిళ మత్స్యకారుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభం తలెత్తడంతో ఈ దేశాలన్నీ మళ్ళీ భారత్ వైపు చూస్తున్నాయి.
