లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఒక బస్టాండ్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఆకలిగా ఉంది పకోడీలు కొనివ్వమని భర్తను కోరిన భార్య, ఆయన వెళ్లిన కొద్దిసేపటికే అక్కడి నుండి మాయమైంది. ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయి ఉండవచ్చని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్కు, రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్జిమ్కు గతేడాది డిసెంబర్ 1న వివాహమైంది. ఇటీవల హోలీ పండుగ రావడంతో, రిమ్జిమ్ తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. భర్త అనుమతితో ఆమె తన తల్లిగారి ఇంటికి వెళ్లి పండుగ జరుపుకుంది.
పకోడీ అడిగిన భార్య
హోలీ పండుగ ముగిసి చాలా రోజులు గడిచినా రిమ్జిమ్ తిరిగి తన అత్తారింటికి రాలేదు. దీంతో భర్త ప్రీతమ్ సింగ్ స్వయంగా భార్య ఇంటికి వెళ్లి ఆమెను తీసుకుని బస్సులో బయలుదేరాడు. దారిలో మొరాదాబాద్ జిల్లాలోని బస్టాండ్లో వారు వేరే బస్సు ఎక్కడానికి దిగారు. ఆ సమయంలో తనకు ఆకలిగా ఉందని, ‘పకోడీలు’ కొనివ్వమని రిమ్జిమ్ తన భర్తను అడిగింది.
మాయమైన భార్య
భార్య మాట నమ్మి ప్రీతమ్ సింగ్ పకోడీలు కొనడానికి దగ్గరలోని దుకాణానికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పకోడీలు తీసుకుని తిరిగి వచ్చేసరికి అక్కడ భార్య కనిపించలేదు. ఆమె బహుశా ‘రెస్ట్రూమ్’కు వెళ్లిందేమో అని భావించి ఆయన కొంతసేపు వేచి చూశాడు.
ప్రియుడితో ఎస్కేప్?
చాలా సేపటికీ భార్య రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రీతమ్ ఆమె మొబైల్కు ఫోన్ చేశాడు. కానీ అది ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది. షాక్కు గురైన ఆయన బస్టాండ్ అంతా వెతికినా ఫలితం లేకపోయింది. వెంటనే రిమ్జిమ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వారు కూడా తమకు తెలిసిన చోట విచారించారు.
ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో ప్రీతమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తన సొంత గ్రామానికి చెందిన ఒక యువకుడితో కలిసి పారిపోయి ఉండవచ్చని ఆయన పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, బస్టాండ్లోని సిసిటివి (CCTV) కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే రిమ్జిమ్ సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమె కోసం గాలింపు చేపట్టారు.
