న్యూఢిల్లీ: రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటం గొప్ప విషయమే అయినప్పటికీ, గ్రహీతల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరెవరు రక్తదానం చేయకూడదనే అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను బలంగా వినిపించింది.
ఎవరు రక్తదానం చేయకూడదు?
నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ మరియు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) 2017లో విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్రం సమర్థించింది. దీని ప్రకారం:
ట్రాన్స్జెండర్లు
పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులు (MSM)
మహిళా లైంగిక వృత్తిదారులు
వీరిని రక్తదానం చేయకుండా నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది. వీరు ‘హై రిస్క్’ (వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న) గ్రూపుల్లో ఉన్నందున, వీరి రక్తం ద్వారా ఇతరులకు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.
వ్యక్తిగత హక్కుల కంటే ప్రజారోగ్యమే ముఖ్యం!
ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు.
“రక్తం ఇచ్చే వ్యక్తి హక్కు కంటే, సురక్షితమైన రక్తాన్ని పొందే గ్రహీత హక్కు చాలా పెద్దది. నిపుణుల సలహా మేరకే ఈ నిబంధనలు రూపొందించాం. వీటిని సడలిస్తే గ్రహీతల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు” అని ఆమె పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదన: “అది వివక్షే!”
అయితే, పిటిషనర్ల తరఫు న్యాయవాది జయనా కొఠారి ఈ వాదనను వ్యతిరేకించారు. ఒక వ్యక్తి యొక్క లింగ గుర్తింపు ఆధారంగా వారిని నిషేధించడం వివక్షే అవుతుందని, కేవలం ‘అన్‌సేఫ్ సెక్స్’ (అసురక్షిత శృంగారం) మాత్రమే ప్రమాదకరమని ఆమె వాదించారు. అందరికీ పరీక్షలు (NAT – Nucleic Acid Testing) నిర్వహించి రక్తాన్ని సేకరించాలని ఆమె కోరారు.
సుప్రీంకోర్టు ఏమంది?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత రక్తమార్పిడి పొందే పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రోగులకు వ్యాధి సోకే అవకాశం 1 శాతం కూడా ఉండకూడదని పేర్కొంటూ, ఈ కేసుపై వివరణాత్మక విచారణను వాయిదా వేసింది.
