లక్నో: క్షణకాలం సుఖం కోసం వేసుకున్న మాత్రలు ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చాయి. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు, లైంగిక సామర్థ్యం పెంచుకునే మాత్రలను అతిగా వాడటంతో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
బాగ్పత్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ (34) పంజాబ్‌లో పనిచేస్తూ ఇటీవలె తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆదివారం ఉదయం తన యజమానికి ప్రమాదం జరిగిందని ఇంట్లో అబద్ధం చెప్పి, బులంద్‌షహర్‌లో ఉంటున్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు.
హోటల్ గదిలో ఏం జరిగింది?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వినోద్ మరియు ఆ యువతి మొదట ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వినోద్ ఎటువంటి డాక్టర్ సలహా లేకుండా, లైంగిక సామర్థ్యం పెంచే మాత్రలను ‘ఓవర్ డోస్’ (అతిగా) తీసుకున్నాడు. అనంతరం వారిద్దరూ పార్కుకు వెళ్లగా, అక్కడ వినోద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మాత్రల ప్రభావంతో గుండెపై ఒత్తిడి పెరిగి అతను మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఆస్పత్రిలో మృతదేహం.. ప్రియురాలు మాయం!
వినోద్ స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన యువతి, అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించింది. అక్కడ వినోద్ తన భర్త అని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందిస్తుండటంతో భయపడిపోయిన ఆ యువతి, వినోద్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైంది.
పోలీసుల విచారణ
వినోద్ సోదరుడు ప్రదీప్‌కు ఆ యువతి ఫోన్ చేసి, అతనికి ప్రమాదం జరిగిందని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. వినోద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
