ఇంటిని, పరిసరాలను అందంగా అలంకరించుకోవడానికి పూల తోటలను పెంచడం చాలా మందికి అలవాటు. దీని కోసం సమయాన్ని, డబ్బును వెచ్చించడానికి కూడా వెనుకాడరు. ఇటీవల కేరళలో గోడలు, ప్రహరీలపై పసుపు రంగు పూలతో దట్టంగా అలుముకున్న ఒక రకమైన తీగ మొక్క బాగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ పూల ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
‘క్యాట్స్ క్లా’ (Cat’s Claw) అని పిలిచే ఈ పసుపు పూల మొక్క ప్రస్తుతం ఒక ‘వైరల్ ఫ్యాషన్’గా మారిపోయింది. ఇల్లు అందంగా కనిపిస్తుందని చాలా మంది దీనిని నర్సరీల నుండి తెచ్చి నాటుతున్నారు. అయితే, ఈ మొక్క చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని వృక్షశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతికి మరియు అడవులకు ముప్పు కలిగించే ఈ మొక్కను ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి.
దీనిని ఎందుకు ప్రమాదకరం అంటారు?
- పిల్లి గోళ్ల వంటి పట్టు: ఈ తీగలు పిల్లి గోళ్ల మాదిరిగా చెట్లను, గోడలను గట్టిగా అంటిపెట్టుకుని 30 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
- చెట్ల మరణం: ఇది ఏదైనా చెట్టుపైకి పాకితే, ఆ చెట్టు ఆకులకు సూర్యరశ్మి తగలకుండా మొత్తం కప్పేస్తుంది. ఫలితంగా ఆ చెట్టు క్రమంగా చనిపోతుంది.
- స్థానిక మొక్కల వినాశనం: నేలపై పాకితే చుట్టుపక్కల ఉన్న ఇతర చిన్న మొక్కలను పెరగనివ్వదు. ఇదొక ‘దురాక్రమణ మొక్క’ (Invasive Plant) కావడం వల్ల ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దీనిని నిషేధించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కూడా దీని సాగుపై ఆంక్షలు ఉన్నాయి.
తక్కువ సంరక్షణతో ఏడాదంతా పూలు పూస్తుందని చాలా మంది దీనిని పెంచుతున్నారు, కానీ ఇది తోటలోని ఇతర మొక్కలకు ప్రాణాంతకమని గుర్తించాలి.

Leave a Reply