పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా ఇంధన సరఫరాపై దీని ప్రభావం పడే అవకాశం ఉండటంతో, శ్రీలంక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు మళ్లీ ‘క్యూఆర్ కోడ్ (QR Code)’ ఆధారిత రేషనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
కొత్త నిబంధనలు ఇవే:
ప్రస్తుతానికి ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పంపిణీపై పరిమితులు విధించారు. వారానికి కేటాయించిన కోటా వివరాలు:
- కార్లు: వారానికి గరిష్ఠంగా 15 లీటర్లు మాత్రమే.
- బస్సులు: వారానికి 60 లీటర్ల వరకు అనుమతి.
ఎందుకీ క్యూఆర్ విధానం?
ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విధానంలో:
- ప్రతి వాహనానికి ఒక ప్రత్యేక QR ట్యాగ్ కేటాయిస్తారు.
- పెట్రోల్ బంకుల్లో ఈ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే నిర్ణీత పరిమాణంలో ఇంధనాన్ని నింపుతారు.
గత అనుభవమే స్ఫూర్తి: 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఈ క్యూఆర్ విధానం అద్భుత ఫలితాలను ఇచ్చింది. అప్పట్లో క్యూ లైన్లను తగ్గించడంలో, పారదర్శకమైన పంపిణీలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముందస్తుగా మళ్లీ అదే బాటలో పయనిస్తోంది లంక ప్రభుత్వం.
