పోలీస్ పరీక్షలో అడిగిన ఆ ఒక్క ప్రశ్న..! “స్వయంగా బీజేపీ ప్రభుత్వమే ఆగ్రహం”. యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశం.. ఇంతకీ అందులో ఏముందంటే..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నియామక పరీక్షలో, ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అడిగిన వివాదాస్పద ప్రశ్న అధికార బీజేపీ వర్గాల్లోనే తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లో శనివారం (మార్చి 14) పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష జరిగింది. ఇందులో జనరల్ నాలెడ్జ్ విభాగంలో, “పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే వారిని ఒకే మాటలో ఏమని పిలుస్తారు?” అనే ప్రశ్న అడిగారు.

దీనికి సమాధానాలుగా: పండిట్, అవకాశవాది, నిజాయితీపరుడు, సద్గుణవంతుడు అనే నాలుగు ఎంపికలు (Options) ఇచ్చారు. ఇందులో ‘పండిట్’ అనే పదాన్ని ‘అవకాశవాది’ అనే పదానికి సమానార్థకంగా చేర్చడం ఒక సామాజిక వర్గాన్ని అవమానించడమేనని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ విషయంపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, “ఏ సామాజిక వర్గం యొక్క గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి ప్రశ్నలను ఎంతమాత్రం అంగీకరించలేము. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలు రమేష్ చంద్ర మిశ్రా, శలభ్ మణి త్రిపాఠి మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అభిజత్ మిశ్రా దీనిపై స్పందిస్తూ.. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. వీరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తక్షణమే లేఖ రాశారు. అఖిల భారత హిందూ మహాసభ కూడా ఈ విషయంలో కేసు వేయబోతున్నట్లు ప్రకటించింది. “పండిట్ అనేది జ్ఞానానికి, గౌరవానికి సూచిక. దానిని అవకాశవాదంతో పోల్చడం ఒక సామాజిక వర్గంపై ద్వేషాన్ని చూపిస్తుంది,” అని ఆ సంస్థ ప్రతినిధి శిశిర్ చతుర్వేది పేర్కొన్నారు.

వివాదం ముదరడంతో, ప్రశ్నపత్రాన్ని రూపొందించిన బృందంపై శాఖాపరమైన విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ వివాదాస్పద ప్రశ్నను వెంటనే రద్దు చేయాలని, భవిష్యత్తులో ప్రశ్నపత్రాల తయారీలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. కులపరమైన ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశంతోనే ఈ ప్రశ్నను కావాలనే రూపొందించారా అనే కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: