కన్నూర్ ‘లేడీ కిల్లర్స్’: వృద్ధురాలిని చంపి బంగారం దోచుకున్నారు.. 10 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ 7 భాషలు తెలిసిన తల్లి-కూతుళ్లు!

కేరళలోని కన్నూర్‌లో 2016లో జరిగిన ఒక సంచలనాత్మక హత్య కేసులో పోలీసులకు 10 ఏళ్ల తర్వాత భారీ విజయం లభించింది. 60 ఏళ్ల వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసి పరారైన తల్లి-కూతుళ్లను క్రైమ్ బ్రాంచ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన వీరు, గత దశాబ్ద కాలంగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వేషధారణను, నగరాలను మారుస్తూ తప్పించుకుంటున్నారు. వీరి వద్ద నుండి దొంగిలించిన బంగారం, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరణ పాశాన్ని ఎలా విసిరారు? ఈ హత్య కథ ఏ థ్రిల్లర్ సినిమానో తలపిస్తుంది. ఏప్రిల్ 2016లో ఈ ఇద్దరు మహిళలు కన్నూర్‌లోని ఇరిక్కుర్ ప్రాంతానికి వచ్చి, తాము వస్త్ర వ్యాపారులమని చెప్పుకుంటూ కుంజామినా ఇంటి పక్కన ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మెల్లగా ఆ వృద్ధురాలి నమ్మకాన్ని గెలుచుకుని స్నేహం చేశారు. ఏప్రిల్ 30, 2016 ఉదయం కుంజామినాను తమ గదికి పిలిపించి, ఆమె లోపలికి రాగానే ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఆమె గొంతు, ఛాతి, పొట్టపై తీవ్రంగా పొడిచి చంపిన తర్వాత, ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, గాజులు, నగదు తీసుకుని పారిపోయారు.

పోలీసుల కళ్లగప్పి ఎలా తిరిగారు? విచారణలో తేలిందేమిటంటే, ఈ మహిళలు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి నేరాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. వీరు దొంగ పత్రాలతో గదులను అద్దెకు తీసుకునేవారు. నేరం చేసిన వెంటనే పాత మొబైల్ ఫోన్లను పారేసి, ఇతరుల పేర్లతో ఉన్న సిమ్ కార్డులను వాడేవారు. ఒకే నగరంలో ఎక్కువ రోజులు ఉండకుండా.. కేరళలోని కన్నూర్, కాసరగోడ్, వయనాడ్, తిరువనంతపురంతో పాటు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తలదాచుకున్నారు.

7 భాషల్లో ప్రావీణ్యం: వీరికున్న అతిపెద్ద బలం భాషా పరిజ్ఞానం. వీరు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. దీనివల్ల ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక ప్రజల్లో సులభంగా కలిసిపోయేవారు, ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. 2024లో ఈ కేసు స్టేట్ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయిన తర్వాత విచారణ వేగవంతమైంది. ఎట్టకేలకు ఉజ్జయినిలో వీరిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిని కోర్టులో హాజరుపరిచి, మరిన్ని నిజాలు రాబట్టేందుకు రిమాండ్‌లోకి తీసుకున్నారు.


Posted

in

by

Tags: