టెహ్రాన్: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. గత రెండు వారాలుగా సాగుతున్న ఈ పోరులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జారీ చేసిన హెచ్చరిక అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. “పిల్లలను చంపిన ఈ నేరస్థుడు ఒకవేళ బతికే ఉంటే, మా పూర్తి శక్తిని ఉపయోగించి అతడిని వెతికి మరీ చంపుతాం” అని నెతన్యాహును ఉద్దేశించి ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
నెతన్యాహు వీడియోపై వివాదం: మార్చి 13న నెతన్యాహు తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల గురించి ఆయన ఆ వీడియోలో వివరించారు. అయితే ఆ వీడియోను గమనించిన కొందరు నెటిజన్లు, ఆయన చేయి కదిపినప్పుడు ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిందా అనే అనుమానం మొదలైంది. దీనిపై #WhereIsBibi అనే హ్యాష్‌ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
కొందరు విశ్లేషకులు నెతన్యాహు మరణించారని, ఇప్పుడు వస్తున్నవన్నీ AI వీడియోలని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ వార్తలను ఖండించింది. ఆయన క్షేమంగా ఉన్నారని, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేసింది.
