పాకిస్థాన్ వైమానిక దళం నిన్న రాత్రి (మార్చి 16) ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది సామాన్య పౌరులు మరణించగా, మరెంతో మంది గాయపడ్డారు. పాకిస్థాన్ పష్తూన్ మానవ హక్కుల కార్యకర్త మరియు పష్తూన్ తహఫ్ఫుజ్ మూమెంట్ (PTM) చీఫ్ మంజూర్ పష్తీన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
‘ఇది పాక్ ప్రభుత్వ ఉగ్రవాద దాడి’: మంజూర్ పష్తీన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ సైన్యం కాబూల్‌లోని ఆసుపత్రిపై ఉగ్రవాద దాడికి పాల్పడిందని ఆరోపించారు. “వందలాది మంది అమాయక పౌరుల రక్తం చిందించారు. ఈ అమానవీయ చర్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తాం. కాబూల్‌ను నాశనం చేయడానికి ఫత్వాలు ఇచ్చే వారు, ఆసుపత్రిలో ముక్కలైన అమాయకుల శవాలను చూసైనా సిగ్గుపడాలి” అని ఆయన మండిపడ్డారు.
దాడులకు గురైన ప్రాంతాలు: నిన్న రాత్రి గం. 9:30 నిమిషాలకు పాక్ వైమానిక దళానికి చెందిన JF-17 మరియు F-16 యుద్ధ విమానాలు కాబూల్‌పై విరుచుకుపడ్డాయి.
- రక్షణ మంత్రిత్వ శాఖ సమీపంలోని నివాస ప్రాంతాలు.
- ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (GDI) హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న కాలనీలు.
- అధ్యక్ష భవనం సమీపంలోని ప్రాంతాలు.
- కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న 2000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించారు.
మరణాల సంఖ్య: కేవలం 23 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కాబూల్‌తో పాటు నంగర్హార్ ప్రాంతంలో కూడా బాంబు దాడులు జరిగాయి. ప్రస్తుతం కాబూల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
