ఆఫ్ఘనిస్తాన్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి; 400 మంది మృతి, 250 మందికి గాయాలు!

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించగా, మరో 250 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రతినిధి తెలిపారు.

పాకిస్థాన్ జరిపిన ఈ దాడుల్లో ఆసుపత్రిలోని మెజారిటీ భాగం ధ్వంసమైందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తాము కాబూల్‌లోని ఏ ఆసుపత్రిని లక్ష్యం చేసుకోలేదని చెబుతూ పాకిస్థాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. పొరుగు దేశాల మధ్య కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై దాడి: కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న ఒక వ్యసన విముక్తి కేంద్రం (Drug Rehab Center) పై పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడిలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. “పాకిస్థాన్ సైనిక యంత్రాంగం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతల సరిహద్దులను ఉల్లంఘించింది. కాబూల్‌లోని పునరావాస కేంద్రమే లక్ష్యంగా దాడి చేయడంతో అక్కడ చికిత్స పొందుతున్న వారు ప్రాణాలు కోల్పోయారు” అని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ చర్యను మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా ఆయన అభివర్ణించారు.

పాకిస్థాన్ వాదన: సోమవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నట్లు తాలిబన్ అధికారి హమ్దుల్లా ఫిత్రత్ ‘X’ వేదికగా వెల్లడించారు. భవనంలో చెలరేగిన మంటలను ఆర్పివేయడానికి, శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మొషారఫ్ జైదీ ఈ ఆరోపణలను ఖండించారు. కేవలం ఉగ్రవాదుల ఆయుధశాలలు, మందుగుండు సామాగ్రి నిల్వలు మరియు వారి మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ‘ప్రిసిషన్ స్ట్రైక్స్’ (ఖచ్చితమైన దాడులు) నిర్వహించామని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తాలిబన్ల వాదనలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని పాక్ పేర్కొంది.

ముదిరిన వివాదం: పాకిస్థాన్ వాయువ్య జిల్లా అయిన బజౌర్‌లోని ఒక ఇంటిపై ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రయోగించిన మోర్టార్ షెల్స్ పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన గంటల వ్యవధిలోనే ఈ వైమానిక దాడులు జరగడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు సురక్షిత తావళాలను కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా, కాబూల్ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.


Posted

in

by

Tags: