రాజ్యసభలో సంజయ్ రౌత్ గర్జన: ‘ఇరాన్ దయవల్ల మీ నౌకలు వదిలారు.. అది మర్చిపోకండి!’

న్యూఢిల్లీ: రాజ్యసభలో మంగళవారం (మార్చి 17) శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలు మరియు కొరతపై కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రభుత్వం అంతా బాగుందని చెబుతున్నా, బయట పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటూ మండిపడ్డారు.

ప్రసాదాలపై గ్యాస్ సెగ: కాశీలోని అన్నపూర్ణ మహాక్షేత్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న నిత్యాన్నదాన సత్రం గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా మూతపడిందని రౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. “అక్కడ రోజూ 10-15 వేల మంది భక్తులు ప్రసాదం స్వీకరించేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ లేదు. ఇరాన్ దయవల్ల మీ రెండు నౌకలు విడుదలయ్యాయి, అది మర్చిపోకండి” అని ఆయన వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో పరిస్థితులు: మహారాష్ట్రలోని షిరిడీలో గతంలో ప్రసాదంగా రెండు లడ్డూలు ఇచ్చేవారని, ఇప్పుడు గ్యాస్ లేక ఒకే లడ్డూ ఇస్తున్నారని రౌత్ పేర్కొన్నారు. ముంబైలో రోజూ 20 లక్షల వడాపావ్‌లు అమ్ముడయ్యేవని, గ్యాస్ కష్టాల వల్ల అది ఇప్పుడు 5 లక్షలకు పడిపోయిందని చెప్పారు.

ప్రధానిపై విమర్శలు: దేశంలో గ్యాస్ సంక్షోభం వల్ల ప్రజలు అల్లాడుతుంటే, ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీల్లో బిజీగా ఉన్నారని రౌత్ విమర్శించారు. “ప్రధాని ఇప్పుడు ఢిల్లీలో ఉండి అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాల్సింది. రూపాయి విలువ పడిపోతోంది, నిరుద్యోగం పెరుగుతోంది. అప్పులు తీర్చలేక మహారాష్ట్రలో 17 మంది రైతులు తమ కిడ్నీలు అమ్ముకున్నారు” అని సంచలన ఆరోపణలు చేశారు.


Posted

in

by

Tags: