మరికొన్ని గంటల్లో అమెరికా తీసుకోబోయే కీలక నిర్ణయం.. గోల్డ్ మార్కెట్‌ను చుట్టుముట్టబోతున్న సుడిగాలి!

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఈ రాత్రి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఇది పసిడి మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది. అసలు బంగారం ధరలకు అమెరికా నిర్ణయానికి సంబంధం ఏమిటి? ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

మన దేశంలో ఆర్‌బీఐ (RBI) నిర్ణీత కాల వ్యవధిలో వడ్డీ రేట్లను ఎలా సవరిస్తుందో, అదేవిధంగా అమెరికాలోని ఫెడరల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లపై నిర్ణయాలు తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకుంటుంది.

వడ్డీ రేట్లు: అమెరికాలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం నిన్న, నేడు జరిగింది. మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 3.5% నుండి 3.75% మధ్య ఉన్నాయి. ఈ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయమే బంగారం ధరల గమనాన్ని మారుస్తుంది.

అంచనాలు: నెల రోజుల క్రితం వరకు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది కనీసం మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని నిపుణులు భావించారు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు దానివల్ల కలిగే ద్రవ్యోల్బణ భయం ఈ అంచనాలను మార్చేశాయి. దీనివల్ల ఈ ఏడాది పొడవునా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ యుద్ధం మరో రెండు నెలల పాటు కొనసాగి, ముడిచమురు ధర బారెల్‌కు 100 డాలర్లు దాటితే, ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

ఏం జరగవచ్చు? ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకే ఎక్కువ అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వడ్డీ రేట్లను పెంచే సాహసం చేయకపోవచ్చు. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో అమెరికా జీడీపీ (GDP) వృద్ధి కేవలం 0.7% మాత్రమే నమోదైంది.

ప్రభావం ఎలా ఉంటుంది? నేటి నిర్ణయం తర్వాత ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసే వ్యాఖ్యలు కీలకం. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆయన సానుకూల సంకేతాలిస్తే బంగారం ధరలు పెరుగుతాయి. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని లేదా ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేస్తే బంగారం ధరలు తగ్గుతాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ రాత్రి 11:30 గంటలకు వెలువడే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. రేపటి బంగారం ధరలు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి.


Posted

in

by

Tags: