మన మూత్రపిండాలు ప్రధానంగా రక్తం నుండి వ్యర్థ పదార్థాలను మరియు అదనపు ద్రవాలను వడపోస్తాయి, ఇవి మూత్రం రూపంలో శరీరం నుండి బయటకు పంపబడతాయి. వ్యర్థాలను తొలగించడమే కాకుండా, కిడ్నీలు రక్తపోటును నియంత్రించడం మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, కొన్ని అలవాట్లు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి. ధూమపానం, అధిక ఉప్పు వాడకం గురించి అందరికీ తెలుసు, కానీ పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) మితిమీరి వాడటం వల్ల కలిగే ముప్పు అంతకంటే ప్రమాదకరమైనది.
కిడ్నీల ఆరోగ్యంపై పెయిన్ కిల్లర్స్ ప్రభావం: సాధారణంగా దొరికే నొప్పి నివారణ మందులు, ముఖ్యంగా నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs), నొప్పి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వాటి అతి వినియోగం కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజీ విభాగం ఛైర్మన్ డాక్టర్ అనంత్ కుమార్ మాట్లాడుతూ.. “పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ‘సైలెంట్ ఎపిడెమిక్’ (నిశ్శబ్ద మహమ్మారి)ను నేను చూస్తున్నాను. ఇవి కిడ్నీ రక్త నాళాలను కుంచింపజేసి, వడపోత సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజూరీ (AKI)కి దారితీస్తుంది. ముఖ్యంగా మధుమేహం (Diabetes) లేదా రక్తపోటు ఉన్నవారిలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ముప్పు పెరుగుతుంది,” అని వివరించారు.
పెయిన్ కిల్లర్స్ వల్ల కలిగే నష్టాలు:
- రక్త ప్రసరణ తగ్గడం: కిడ్నీలకు అందే రక్త ప్రసరణ తగ్గి వడపోత ప్రక్రియ మందగిస్తుంది.
- అక్యూట్ కిడ్నీ ఇంజూరీ (AKI): అకస్మాత్తుగా కిడ్నీ పనితీరు పడిపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD): పెయిన్ కిల్లర్స్ నిరంతరం వాడటం వల్ల కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతినవచ్చు.
- కిడ్నీ స్కారింగ్: కిడ్నీ కణజాలం దెబ్బతినడం వల్ల చివరి దశకు (End-stage renal disease) చేరుకునే ప్రమాదం ఉంది. 24 ఏళ్ల యువకుడొకరు మూడేళ్లపాటు ‘డిక్లోఫెనాక్’ వాడి కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న సందర్భాన్ని డాక్టర్ ఉదహరించారు.
సురక్షితంగా ఉండటానికి చిట్కాలు:
- తక్కువ మోతాదు: మందులను వీలైనంత తక్కువ కాలం, తక్కువ మోతాదులో వాడండి. చిన్నపాటి నొప్పులకు డాక్టర్ సలహా మేరకు పారాసెటమాల్ వంటి సురక్షితమైన మందులను ఎంచుకోండి.
- నీరు ఎక్కువగా తాగండి: మందుల ప్రభావాన్ని కిడ్నీలు తట్టుకోవాలంటే తగినంత నీరు తాగడం ముఖ్యం.
- స్వీయ వైద్యం వద్దు: డాక్టర్ సలహా లేకుండా మందుల షాపులో దొరికే పెయిన్ కిల్లర్లను వాడకండి.
- క్రమం తప్పకుండా తనిఖీలు: కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి.
“భారతదేశంలో కిడ్నీ వ్యాధుల భారం పెరుగుతోంది. మీ కిడ్నీలను రక్షించుకోండి-అవి మీ జీవితకాల మిత్రులు. సొంత వైద్యం అస్సలు వద్దు,” అని నిపుణులు సూచిస్తున్నారు.
