వీధి కుక్కలు ఎప్పుడు, ఎవరిపై దాడి చేస్తాయో ఊహించడం కష్టం. జంతు శాస్త్రవేత్తల ప్రకారం దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇటీవలే పూణేలో ఒక మహిళను కుక్కల గుంపు చుట్టుముట్టి గాయపరచడం వల్ల ఆమె మరణించిన ఘటన మనల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నిపుణులు చెబుతున్న చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
కుక్కలు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? ప్రతి కుక్కకు ఒక స్వంత ప్రాంతం (Territory) ఉంటుంది. ఆ పరిధిలోకి కొత్తవారు వస్తే అవి భయపడి లేదా రక్షణ కోసం మొరుగుతాయి. ఆకలితో ఉన్నప్పుడు, తమ ఆహారాన్ని ఎవరైనా లాక్కుంటారనే భయం కలిగినప్పుడు లేదా తమపై ఎవరైనా దాడి చేస్తారని అనిపించినప్పుడు అవి దూకుడుగా మారుతాయి. ఇక బైకుల విషయానికి వస్తే, వేరే ఏరియా కుక్కలు వేసిన మూత్రం వాసనను పసిగట్టి, తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాయని భావించి కుక్కలు వాహనాలపై దాడి చేస్తాయి.
కుక్కల దాడి నుండి తప్పించుకునే మార్గాలు:
- పరుగెత్తకండి, ప్రశాంతంగా ఉండండి: కుక్కల గుంపు మీదకు వచ్చినప్పుడు ఎప్పుడూ పరుగెత్తకండి. మీరు పరుగెత్తితే వాటికి మిమ్మల్ని వేటాడాలనే సహజ గుణం (Hunting instinct) పుడుతుంది. ఎంత భయమేసినా సరే, నిశ్చలంగా నిలబడండి లేదా చాలా నెమ్మదిగా నడవండి. మీరు వాటికి శత్రువు కాదు, స్నేహితుడు అనే భావన కలిగేలా ప్రశాంతంగా ఉండండి.
- దూరాన్ని పాటించండి: కుక్కలు గుంపుగా ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉంటాయి. కాబట్టి వాటికి మరీ దగ్గరగా వెళ్లకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. అయితే భయంతో దూరంగా పరుగెత్తవద్దు.
- బాడీ లాంగ్వేజ్ ముఖ్యం: కుక్కల కళ్లలోకి నేరుగా చూడకండి (Eye contact). నేరుగా కళ్లలోకి చూడటం వాటిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. చేతులు ఊపడం, గట్టిగా అరవడం వంటివి చేయకండి. ముఖాన్ని ప్రశాంతంగా ఉంచి, సాధారణ స్థితిలో నిలబడండి.
- కుక్క ప్రవర్తనను గమనించండి: కుక్క ఆవలిస్తున్నా, తన పెదవులను నాలుకతో తడుపుకుంటున్నా లేదా మీ నుండి చూపు పక్కకు తిప్పుకున్నా.. ప్రమాదం తప్పినట్లేనని అర్థం. ఆ సమయంలో కుక్క మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వాసన చూస్తుంటే రానివ్వండి, కానీ బలవంతంగా దాన్ని తాకడానికి ప్రయత్నించకండి.
- అత్యవసర స్థితిలో ఏం చేయాలి? ఒకవేళ కుక్క మరీ దూకుడుగా వస్తే, మీ వద్ద ఉన్న బ్యాగ్, జాకెట్ లేదా ఏదైనా వస్తువును మీకు, కుక్కకు మధ్య అడ్డుగా పెట్టుకోండి. నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. కుక్కను కొట్టడానికి లేదా తన్నడానికి ప్రయత్నించకండి, అది వాటిని మరింత రెచ్చగొడుతుంది. వీలైతే స్థానికుల సహాయం కోరండి.
కుక్క కరిస్తే ఏం చేయాలి? ఒకవేళ కుక్క కరిస్తే, వెంటనే ఆ గాయాన్ని సబ్బు మరియు నీటితో కనీసం 10-15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించి రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
