తమిళనాడు, విలాతికుళం కామాంధుడి చేతిలో చిక్కి అత్యాచారానికి, హత్యకు గురైన విలాతికుళం పాఠశాల విద్యార్థిని ఆఖరి నిమిషాల్లో అనుభవించిన నరకం ఏమిటి? కర్రతో తలపై కొట్టి, అడవిలోకి లాక్కెళ్లి పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తమిళనాడును వణికించిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది?
నిందితుడి నేపథ్యం: ఈ కేసులో రామనాథపురం జిల్లాకు చెందిన ధర్మ మునీశ్వరన్‌ను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు 2020లో ఒక వృద్ధురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. కోర్టులో సంతకం పెట్టడానికి వచ్చి, ఖర్చులకు డబ్బులు లేక మళ్ళీ దొంగతనాలకు ప్లాన్ వేశాడు.
ఘటన జరిగిన తీరు: నిందితుడు ఒక బైక్‌ను దొంగిలించి, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని తిరిగాడు. వేడనత్తం గ్రామంలో నిఘా కెమెరాలు లేవని తెలుసుకుని అక్కడ మాటు వేశాడు. మొదట కొందరు మహిళలు గుంపుగా రావడంతో ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఒక మహిళ ఒంటరిగా వచ్చినప్పటికీ ఆమె త్వరగా వెళ్ళిపోవడంతో అవకాశం చిక్కలేదు.
కాసేపటి తర్వాత, ప్రకృతి వైకల్యం తీర్చుకోవడానికి వచ్చిన పాఠశాల విద్యార్థినిని చూసి, ఆమె వెనుక నుండి తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోగానే ఒంటిపై నగలు ఉన్నాయేమోనని వెతికాడు. నగలు ఏమీ లేకపోవడంతో, ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టి, ముళ్ల పొదల్లో పడేసి పారిపోయాడు.
గ్రామస్తుల మధ్యే తిరుగుతూ నాటకం: పాప స్పృహలో ఉన్నప్పుడే తాను వదిలి వెళ్లానని, ఆమె చనిపోయిన విషయం మరుసటి రోజు ఊరి జనం మాట్లాడుకుంటుంటే తెలిసిందని నిందితుడు చెప్పాడు. అంతటి దారుణానికి ఒడిగట్టి కూడా, ఏమీ తెలియనట్లు గ్రామస్తుల మధ్యే తిరుగుతూ.. పోలీసులు ఎవరిని విచారిస్తున్నారు? కేసు ఎక్కడి వరకు వచ్చింది? అని ఆరా తీస్తూ నాటకమాడాడు.
