ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక లారీ బోల్తా పడగానే, అక్కడున్న ఒక వ్యక్తి “లూట్ లో, లూట్ లో” (దోచుకోండి, దోచుకోండి) అని అరుస్తూ దృశ్యాలను రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ, ప్రజల్లో ఉన్న ‘అమానవీయత’పై చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది? థమ్స్ అప్, స్ప్రైట్ వంటి కూల్ డ్రింక్ బాటిళ్లతో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులకు అది ఒక ‘అదృష్టం’లా అనిపించింది. లారీ డ్రైవర్, క్లీనర్ తమను కాపాడమని, బాటిళ్లను తీసుకెళ్లవద్దని ప్రాధేయపడినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు. బాటిళ్ల కోసం ఒకరినొకరు నెట్టుకుంటూ, పరుగు పందెంలా ఎగబడ్డారు. పోలీసులు వచ్చి గుంపును చెదరగొట్టే వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు.
సోషల్ మీడియాలో భిన్న వాదనలు: ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు:
- పేదరికం కారణమా?: దేశంలో 50% జనాభా నెలకు సగటున ₹6,000 కంటే తక్కువ సంపాదిస్తారని, వారికి ఈ కొన్ని వందల రూపాయల విలువైన బాటిళ్లు ఒక రోజు కూలీతో సమానమని ఒకరు వాదించారు. ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే ‘పౌర బాధ్యత’ గుర్తుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
- ప్రవర్తన లోపమా?: మరోవైపు, ఇది పేదరికం కాదు, మనుషుల్లో నశించిపోతున్న ‘మానవత్వం’ అని మరికొందరు వాదించారు. కేవలం పేదవాళ్లే కాదు, విదేశాలకు వెళ్లే ధనవంతులు హోటల్ గదుల్లో వస్తువులను దొంగిలించడం, బహిరంగ ప్రదేశాల్లో పూల కుండీలను ఎత్తుకెళ్లడం వంటివి చూస్తుంటే.. ఇది ఆర్థిక స్థితికి సంబంధించింది కాదని, సంస్కారానికి సంబంధించిందని వారు మండిపడ్డారు.
