మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ ‘హోర్ముజ్’ జలసంధి విషయంలో ఒక ఆసక్తికరమైన దౌత్య పాచిక వేసింది. ఇది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయే తకైచికి ‘సహకరించడం లేదని’ గట్టిగా వార్నింగ్ ఇవ్వగా, మరోవైపు ఇరాన్ జపాన్ వైపు స్నేహహస్తం చాచి ట్రంప్ గాయాలపై కారం చల్లింది.
నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు సరఫరా మార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) గుండా జపాన్ ఓడలు ప్రయాణించడానికి అనుమతిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఇది అమెరికా-జపాన్ సంబంధాల మధ్య కొత్త గీత గీసేలా ఉంది.
ట్రంప్ ‘అవమానం’ – ఇరాన్ ‘ఆఫర్’ మధ్య సంబంధం: గత 48 గంటల్లో జరిగిన పరిణామాలే దీనికి కారణం. గురువారం వాషింగ్టన్లో జపాన్ ప్రధాని సనాయే తకైచితో జరిగిన సమావేశంలో, జపాన్ ‘ముందుకు రావాల్సిందే’ అని ట్రంప్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిలోకి జపాన్ తన నౌకాదళాన్ని పంపాలని ట్రంప్ కోరగా, తమ దేశ ‘శాంతియుత రాజ్యాంగం’ (Pacifist Constitution) అందుకు అంగీకరించదని జపాన్ చేతులెత్తేసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ టోక్యోకు ఫోన్ చేసి – “జపాన్ మా పాత మిత్రుడు. మీరు కోరుకుంటే హోర్ముజ్ గుండా మీ ఓడలకు సురక్షిత మార్గాన్ని ఇవ్వడానికి మేము సిద్ధం” అని ఆఫర్ ఇచ్చారు.
జపాన్‌కు ‘హోర్ముజ్’ ఎందుకు ముఖ్యం? జపాన్ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధి ఒక ‘లైఫ్‌లైన్’ వంటిది. జపాన్ తన అవసరాలకు కావాల్సిన 90% చమురును ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. గత మూడు వారాలుగా సాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడటంతో జపాన్‌లో చమురు కొరత ఏర్పడింది.
ఇరాన్ షరతు: ఒకప్పుడు జపాన్‌లో ఇరాన్ రాయబారిగా పనిచేసిన అరాక్చీ, జపాన్ నుండి ఒక పెద్ద సహాయాన్ని ఆశిస్తున్నారు. తమపై జరుగుతున్న ‘అక్రమ దాడులను’ ఆపడంలో జపాన్ కీలక పాత్ర పోషించాలని ఇరాన్ కోరుతోంది. కేవలం ‘కాల్పుల విరమణ’ మాత్రమే కాకుండా, తమపై మళ్లీ దాడి జరగదని లిఖితపూర్వక హామీ కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ పరిణామంతో ట్రంప్ ప్రభుత్వం రక్షణలో పడగా, జపాన్ ఇప్పుడు తన మిత్రదేశం అమెరికా మాట వింటుందా లేక తన అవసరాల కోసం ఇరాన్‌తో చేతులు కలుపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
