నీలగిరి: నీలగిరి జిల్లాలో 150 అడుగుల లోయలో పడిపోయిన ఒక పర్యాటకుడిని కాపాడేందుకు, ధైర్యంతో ఇనుప తాళ్ల సాయంతో లోయలోకి దిగి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఆర్మీ డాక్టర్ మేజర్ కవితా వాసుపల్లిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
నీలగిరి జిల్లా గూడలూరు నుండి ఊటీ వెళ్లే జాతీయ రహదారిపై అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఊసిమలై వ్యూ పాయింట్’ పర్యాటక కేంద్రం ఉంది. అక్కడికి వెళ్లిన చెంగల్పట్టుకు చెందిన పర్యాటకుడు శివగురునాథన్, మార్చి 19న సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు 150 అడుగుల లోయలో పడిపోయాడు. వెంటనే అతను తన కారు డ్రైవర్‌కు ఫోన్ చేయగా, డ్రైవర్ పోలీసులకు మరియు అటవీశాఖకు సమాచారం అందించారు. రాత్రి సమయం కావడం, ఏనుగులు, పులులు తిరిగే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తన్నీరు సమాచారం మేరకు వెల్లింగ్టన్ ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. కున్నూరు మద్రాస్ రెజిమెంట్ సెంటర్ లెఫ్టినెంట్ కల్నల్ చందన్ మెహతా నాయకత్వంలోని బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్మీ డాక్టర్ మేజర్ కవితా వాసుపల్లి, 150 అడుగుల లోయలోకి తాళ్ల సాయంతో దిగి, తీవ్రంగా గాయపడిన శివగురునాథన్కు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. ఆమె మార్గదర్శకత్వంలో స్ట్రెచర్ సాయంతో 13 గంటల పోరాటం తర్వాత మార్చి 20 తెల్లవారుజామున 3 గంటలకు పర్యాటకుడిని సురక్షితంగా బయటకు తీశారు.
మేజర్ కవిత మాటల్లో: “పర్యాటకుడు లోయలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. రాత్రి 9:15 గంటలకు అక్కడికి చేరుకున్నాం. ఆ ప్రాంతం చాలా ఎత్తుగా, కఠినంగా ఉండటంతో అతడిని గుర్తించడం కష్టమైంది. అతడిని రక్షించడానికి ఆర్మీ బృందం రెండు కొండల మధ్య 70 మీటర్ల పొడవైన ‘టైరోలియన్ ట్రావర్స్ లైన్’ (Tyrolean Traverse Line) ఏర్పాటు చేసింది. నేను లోయలోకి దిగి అతని పరిస్థితిని గమనించి చికిత్స అందించాను. అతనికి ఎముకలు విరగడంతో పరిస్థితి విషమంగా ఉంది. నా సూచనల మేరకు రెస్క్యూ టీమ్ అతడిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు.”
ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన మేజర్ కవితా వాసుపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా మెట్టూరుకు చెందిన వారు. ఆమె 2025లో బ్రహ్మపుత్ర నదిలో 1,040 కి.మీ రాఫ్టింగ్ ప్రయాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించడం విశేషం.
