చెన్నై తాంబరం సమీపంలోని ఇరుంబులియూర్ ముల్లై ఎవెన్యూ ప్రాంతానికి చెందిన సిద్ధ వైద్యుడు అరుణ్ కుమార్ భార్య అభినయ, పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అభినయకు, అరుణ్ కుమార్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని వారాలకే అభినయ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అరుణ్ కుమార్, ఆమెను మానసిక వేధింపులకు గురిచేసేవాడు. అర్ధరాత్రి పూట ఆమె ఫోన్ చెక్ చేయడం, ఎవరితో మాట్లాడుతున్నావని పదేపదే నిలదీస్తూ గొడవ పడటంతో మనస్తాపం చెందిన అభినయ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది.
తనకు ఎవరితోనూ సంబంధం లేదని, పెళ్లికి ముందు కూడా ఎవరినీ ప్రేమించలేదని అభినయ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అరుణ్ కుమార్ నమ్మలేదు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. భర్త వేధింపులు భరించలేక గత నెల 17వ తేదీ రాత్రి అభినయ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాంబరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, భర్త అనుమానమే ఈ మరణానికి ప్రధాన కారణమని తేలింది.
ఆత్మహత్యకు ముందు అభినయ తన చేతిపై సూదితో గీసుకుని, రక్తంతో భర్త పేరు ‘అరుణ్’ అని రాసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. “టాటూ వేయించుకున్నా చెరిగిపోవచ్చు, కానీ ఈ రక్తంతో రాసిన పేరు చెరిగిపోదు” అని ఆమె తన సెల్ఫోన్లో రికార్డ్ చేసింది. “నీకు ద్రోహం చేయాలని మనసులో కూడా అనుకోలేదు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకు నిజాయితీగానే ఉన్నాను” అంటూ తన చివరి సందేశాన్ని అత్యంత భావోద్వేగంతో నమోదు చేసింది.
చేతిపై రక్తంతో రాసిన పేరును ఫోటో తీసి భర్త వాట్సాప్‌కు పంపాలని ప్రయత్నించి, ఆ తర్వాత పంపకుండా ఆపేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధ వైద్యుడు అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అందమైన జీవితం గడపాల్సిన యువ జంట మధ్య అనుమానం అనే చిచ్చు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం బంధువుల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
