న్యూఢిల్లీ: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న ‘పెద్ద కుట్ర’ కేసులో ప్రధాన నిందితుడు షర్జీల్ ఇమామ్ దాదాపు ఆరేళ్ల తర్వాత తిహార్ జైలు నుండి తాత్కాలికంగా బయటకు వచ్చారు. మానవతా దృక్పథంతో ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు ఆయనకు 10 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన తమ్ముడు ముజమ్మిల్ ఇమామ్ పెళ్లికి హాజరు కావడానికి, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడానికి కోర్టు ఈ అనుమతిని ఇచ్చింది.
షర్జీల్ మార్చి 20, 2026న జైలు నుండి విడుదలయ్యారు. ఈ బెయిల్ గడువు మార్చి 30, 2026 వరకు ఉంటుంది. మార్చి 25న బీహార్లోని జహానాబాద్ జిల్లా కాకో గ్రామంలోని వారి పూర్వీకుల నివాసంలో నికాహ్ జరగనుంది.
బెయిల్ నిబంధనలు:
- గడువు: మార్చి 20 నుండి 30 వరకు (10 రోజులు).
- నిబంధనలు: సాక్షులను కలవకూడదు, సోషల్ మీడియా లేదా మీడియాలో మాట్లాడకూడదు, కేవలం కుటుంబ సభ్యులతో ఉంటూ పెళ్లి పనుల్లో మాత్రమే ఉండాలి. మార్చి 30 సాయంత్రం తిరిగి జైలులో లొంగిపోవాలి.
ఎవరీ వరుడు ముజమ్మిల్ ఇమామ్? ముజమ్మిల్ ఇమామ్ షర్జీల్ చిన్న తమ్ముడు. వీరు బీహార్లోని జహానాబాద్ జిల్లాకు చెందినవారు. ముజమ్మిల్ ఒక స్వతంత్ర పాత్రికేయుడు మరియు జేడీయూ (JDU) మాజీ ప్రతినిధిగా చెప్పుకుంటారు. ఒక పాత వ్యాసంలో ముజమ్మిల్ తన అన్నయ్య గురించి భావోద్వేగంగా రాశారు. “నేను నా జీవితాంతం నా అన్నయ్యను చూసి ఈర్ష్య పడ్డాను” అని పేర్కొన్నారు. ఎందుకంటే షర్జీల్ చదువులో టాపర్ (IIT-Bombay, JNU), కానీ ముజమ్మిల్ ఒక సామాన్య విద్యార్థి.
సోదరుల మధ్య అనుబంధం: షర్జీల్ చాలా “అప్రాక్టికల్” వ్యక్తి అని ముజమ్మిల్ అంటారు. రోడ్డు మీద భిక్షగాళ్లకు తన దగ్గర ఉన్న ఒక్క రూపాయి ఇచ్చేసి ఆకలితో ఇంటికి రావడం, రిక్షా వాళ్లతో బేరాలు ఆడకపోవడం, తన కోసం తనే ఎప్పుడూ బట్టలు కొనుక్కోకపోవడం వంటి షర్జీల్ వ్యక్తిత్వాన్ని ముజమ్మిల్ గుర్తు చేసుకున్నారు. “40 లక్షల ప్యాకేజీని వదులుకుని, వేల రూపాయల పుస్తకాలు కొంటూ, బట్టల కోసం ఇతరులపై ఆధారపడే వ్యక్తి నా అన్నయ్య” అని ఆయన రాశారు.
