టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం ఇజ్రాయెల్ దక్షిణ నగరమైన డిమోనాపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది.
దేశంలోని ప్రధాన అణు పరిశోధనా కేంద్రం ఉన్న ప్రాంతంలోనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 40 మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. వీరిలో కొందరికి క్షిపణి శకలాల వల్ల గాయాలు కాగా, మరికొందరు ప్రాణరక్షణ కోసం పరుగులు తీసే క్రమంలో ప్రమాదాలకు గురయ్యారు. కొందరు తీవ్ర మానసిక ఆఘాతానికి (Shock) లోనయ్యారు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవా విభాగం ‘మగెన్ డేవిడ్ అడోమ్’ గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించింది.
డిమోనాలో ‘షిమాన్ పెరెస్ నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్’ ఉంది. క్షిపణి దాడి కారణంగా ఈ అణు పరిశోధనా కేంద్రంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే, ఎటువంటి అణు వికిరణం (Radiation) సంభవించలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది.
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని IAEA అధినేత రాఫెల్ గ్రోసీ తెలిపారు. అణు కేంద్రాల సమీపంలో ఇరుపక్షాలు గరిష్ట సైనిక నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. కాగా, నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే తాము ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, నతాంజ్ దాడిలో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
శనివారం ఉదయం ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే డిమోనాపై క్షిపణి పడింది. నతాంజ్ దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇటువంటి చర్యలు పశ్చిమాసియాలో భారీ విపత్తులకు దారితీస్తాయని హెచ్చరించింది.
