కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముర్షిదాబాద్‌కు చెందిన బలమైన నాయకుడు హుమాయూన్ కబీర్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఒవైసీ వేసిన ఈ అడుగు కేవలం ఒక సాధారణ కూటమి మాత్రమే కాదు, మమతా బెనర్జీకి వెన్నెముకగా ఉన్న ‘ముస్లిం ఓటు బ్యాంక్’ కోటలో చీలిక తెచ్చే ప్రయత్నం. అందుకే ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
కూటమి వివరాలు: ఒవైసీ తన పార్టీ బెంగాల్లో హుమాయూన్ కబీర్ స్థాపించిన ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. “మేము హుమాయూన్ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. బెంగాల్లో 30 శాతం ముస్లిం జనాభా ఉన్నప్పటికీ, సుమారు 5 లక్షల వెనుకబడిన తరగతుల సర్టిఫికెట్లను రద్దు చేయడం వంటి అన్యాయాలు జరిగాయి. మాల్దా పంచాయితీ ఎన్నికల్లో మాకు 60 వేల ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఆ ప్రభావాన్ని మరింత పెంచుతాం” అని ఒవైసీ పేర్కొన్నారు.
టిక్కెట్ల పంపిణీ: హుమాయూన్ కబీర్ ఇప్పటికే దూకుడు పెంచారు. ముర్షిదాబాద్‌లోని తన పార్టీ కార్యాలయం నుండి 153 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలుత 182 మందిని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి 153 మందిని ఖరారు చేశారు. కబీర్ స్వయంగా ముర్షిదాబాద్‌లోని రెజీనగర్ మరియు నౌదా నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు.
మమతకు ఎందుకు ఆందోళన? బెంగాల్‌లోని 294 అసెంబ్లీ సీట్లలో 100 కంటే ఎక్కువ సీట్లలో ముస్లిం ఓటర్లే గెలుపోటములను శాసిస్తారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో వీరి జనాభా ఎక్కువ. ఇప్పటి వరకు ఈ ఓట్లన్నీ ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) కి పడుతూ మమతను అధికారంలో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఒవైసీ-కబీర్ కూటమి ఒక 10 నుండి 15 వేల ఓట్లను చీల్చినా, డజన్ల కొద్దీ సీట్లలో టీఎంసీ అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంది.
బీజేపీ ఎందుకు సంతోషిస్తోంది? బీజేపీ వ్యూహకర్తలు ఎప్పుడూ బెంగాల్లో ముస్లిం ఓట్లు చీలిపోవాలని కోరుకుంటారు. ముస్లిం ఓట్లు ఎంతలా చీలిపోతే, హిందూ ఓట్లు ఏకమై బీజేపీ గెలుపు అంత సులభమవుతుంది. ముఖ్యంగా హిందూ-ముస్లిం జనాభా సమానంగా ఉన్న చోట, ఒవైసీ ఓట్లు చీల్చడం బీజేపీకి ‘సంజీవని’ లాంటిది.
