బెంగళూరు: ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బెంగళూరు మహానగరంలో, ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా అతనికి సాయం చేసిన ఒక కారు యజమాని ఉదంతం సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఫుట్‌పాత్ (నడకదారి) పై అతివేగంగా వస్తూ, అక్కడ ఆగి ఉన్న ఒక కారును బలంగా ఢీకొట్టి కింద పడిపోయాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కారు యజమానులు కిందకు దిగి గొడవపడటం, వాగ్వాదానికి దిగడం మనం చూస్తుంటాం.

కానీ, ఈ ఘటనలో కారు యజమాని ఏమాత్రం అసహనం చెందకుండా కారు దిగి వచ్చి, కింద పడిన బైక్ రైడర్‌ను పైకి లేపి అతనికి అవసరమైన సాయం చేశాడు. తప్పు పూర్తిగా ద్విచక్ర వాహనదారుడిదే అయినప్పటికీ, కారు యజమాని ప్రదర్శించిన ఈ పరిణతి చెందిన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నెటిజన్ల ప్రశంసలు: ‘కర్ణాటక పోర్ట్‌ఫోలియో’ అనే ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫుట్‌పాత్‌పై వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, పాదచారులకు ప్రమాదకరమని నెటిజన్లు పేర్కొంటూనే.. కారు యజమాని శాంత స్వభావాన్ని కొనియాడుతున్నారు. “భారతీయ రహదారులపై మనకు కావాల్సింది ఇలాంటి ఓపికే” అని ఒకరు, “ఇలాంటి మానవత్వం రోడ్ రేజ్ (Road Rage) హత్యలను తగ్గించడానికి సహాయపడుతుంది” అని మరొకరు కామెంట్ చేశారు. అలాగే ఫుట్‌పాత్‌లపై వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


Posted

in

by

Tags: