భారత్‌కు ‘సంక్షోభ భాగస్వామి’గా ఆ దేశం.. గ్యాస్ కొరతను తీర్చేందుకు ఎల్‌పిజి సరఫరా రెట్టింపు!

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఎల్‌పిజి (LPG) కొరతను అధిగమించేందుకు అర్జెంటీనా తన సరఫరాను భారీగా పెంచింది. 2026 జనవరి నుండి మార్చి మధ్య కాలంలో అర్జెంటీనా భారత్‌కు 50,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజిని రవాణా చేసింది. ఇది 2025లో సరఫరా చేసిన 22,000 టన్నుల కంటే రెట్టింపు కంటే ఎక్కువ. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే బాహియా బ్లాంకా ఓడరేవు నుండి 39,000 టన్నుల గ్యాస్ రాగా, మార్చి 5న మరో 11,000 టన్నుల కార్గో భారత్‌కు బయలుదేరింది.

అర్జెంటీనాలో ఎల్‌పిజి ఉత్పత్తి: అర్జెంటీనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జనవరి 2026లో ఆ దేశ సహజ వాయువు ఆధారిత ఎల్‌పిజి ఉత్పత్తి 2,59,000 టన్నులుగా నమోదైంది. వార్షిక ఉత్పత్తి 2024లో 2.6 మిలియన్ టన్నుల నుండి 2025 నాటికి 2.63 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. గమనార్హం ఏంటంటే, 2024కి ముందు అర్జెంటీనా నుండి భారత్‌కు ఎటువంటి ఎల్‌పిజి దిగుమతులు లేవు.

భారత మార్కెట్‌పై అర్జెంటీనా దృష్టి: భారతదేశ ఎల్‌పిజి మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవడానికి అర్జెంటీనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బాహియా బ్లాంకా ప్రాసెసింగ్ యూనిట్‌లో కొత్త ‘నేచురల్ గ్యాస్ లిక్విడ్స్ ఫ్రాక్షనేషన్’ విభాగాన్ని 2026లో ప్రారంభించనుంది. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, ఎగుమతులకు మరింత గ్యాస్ అందుబాటులోకి వస్తుంది.

భారత్ – అర్జెంటీనా వాణిజ్యం: దక్షిణ అమెరికాలో అర్జెంటీనా భారత్‌కు ఒక ముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగా మారుతోంది. 2025 జనవరి-నవంబర్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 6.34 బిలియన్ డాలర్లకు చేరుకుంది (36.77% వృద్ధి). ప్రస్తుతం అర్జెంటీనాకు భారత్ 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఎడిబుల్ ఆయిల్స్ (సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్), తోలు వస్తువులు, తృణధాన్యాలు మరియు పప్పు దిగుమతుల కోసం భారత్ ప్రధానంగా అర్జెంటీనాపై ఆధారపడుతోంది.

భారత్‌లో తాజా పరిస్థితి: ప్రస్తుత గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు భారీ ఊరటనిచ్చింది. గ్యాస్ కోటాను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 50 శాతానికి పెంచింది. ఇందులో భాగంగా మార్చి 23 (నేటి) నుండి రాష్ట్రాలకు అదనంగా 20 శాతం ఎల్‌పిజి సరఫరా చేయనున్నారు. ఆహార సరఫరా మరియు ప్రజారోగ్య రంగానికి ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ తెలిపారు.


Posted

in

by

Tags: