కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్న CIA & మొసాద్.. చిన్న పొరపాటు జరిగినా ఇరాన్ కథ ముగిసినట్టే!

టెహ్రాన్: మొజ్తబా ఖమేనీ గత మార్చి 9వ తేదీన ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టి దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇప్పటివరకు ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

ఆయన ఇలా ప్రజల ముందుకు రాకపోవడానికి అమెరికా (CIA) మరియు ఇజ్రాయెల్ (Mossad) నిఘా అధికారులు రెండు ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం!

మధ్యప్రాచ్యంలో యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైన మొదటి రోజే, నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించారు. నాయకత్వం లేక ఇరాన్ కుప్పకూలుతుందని భావించినా, ఇరాన్ తిరిగి పుంజుకుని పోరాటం కొనసాగిస్తోంది.

కొత్త సుప్రీం లీడర్: అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని మార్చి 9న నూతన సుప్రీం లీడర్‌గా అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ దాడిలో మొజ్తబా తన తండ్రిని, భార్యను మరియు కుమారుడిని కోల్పోయారు. ఆయన ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని సమాచారం. కానీ ఆయన గాయాలు ఎంత తీవ్రమైనవి? ఆయన అసలు ఎక్కడున్నారు? అనే దానిపై స్పష్టత లేదు. సాధారణంగా పర్షియన్ నూతన సంవత్సరం (మార్చి 20) నాడు సుప్రీం లీడర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ ఈ ఏడాది మొజ్తబా కేవలం ఒక లేఖను మాత్రమే విడుదల చేశారు.

నిఘా సంస్థల వ్యూహం: అమెరికాకు చెందిన CIA మరియు ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ వంటి అంతర్జాతీయ నిఘా సంస్థలు మొజ్తబా కోసం గాలిస్తున్నాయి. ఒకవేళ ఆయన ఏదైనా వీడియో విడుదల చేస్తే, దాని వెనుక ఉన్న నేపథ్యం లేదా టెక్నాలజీ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో కనిపెట్టవచ్చని (కళ్లలో ఒత్తులు వేసుకుని) ఎదురుచూస్తున్నాయి. ఆయన వీడియో విడుదల చేయకపోవడం వల్ల ఆయన ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే అనుమానాలు పెరిగాయి. అయితే, అమెరికా మీడియా కథనాల ప్రకారం ఆయన సజీవంగా ఉన్నారని, ఇరాన్ అధికారులు ఆయనతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

సందేహం: మొజ్తబా ప్రాణాలతో ఉన్నప్పటికీ, దేశం మొత్తం ఆయన నియంత్రణలో ఉందా? లేదా? అనే దానిపై ఇజ్రాయెల్ అధికారులకు సందేహాలు ఉన్నాయి. అమెరికా నిఘా అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఆయన బతికే ఉన్నారు, కానీ ఇరాన్ మొత్తం ఆయన ఆదేశాల మేరకే నడుస్తోందని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు లేవు” అని వ్యాఖ్యానించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన టెలిగ్రామ్ ఛానల్‌లో కొన్ని ఫోటోలు వచ్చాయి. అవి పాతవా? లేక ఇప్పుడు తీసినవా? అని CIA అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కారణాలు: మొజ్తబా బయటకు రాకపోవడానికి అధికారులు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి, భద్రతా కారణాల దృష్ట్యా బయటకు వస్తే మొసాద్ ఆయనను టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. రెండోది, ఆయన గాయాలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల వీడియో తీయడానికి కూడా వీలులేని పరిస్థితిలో ఉండవచ్చు. ఈ మర్మం వీడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


Posted

in

by

Tags: