ట్రంప్ చెప్పింది అబద్ధమా? చర్చలే జరగలేదు.. వారే వెనక్కి తగ్గారు! ఇరాన్ ఘాటు విమర్శలు

టెహ్రాన్: ఇరాన్‌తో గత రెండు రోజులుగా జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని, అందుకే రాబోయే 5 రోజుల పాటు ఆ దేశంపై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇరాన్ దీనిపై తీవ్రంగా స్పందించింది. అమెరికాతో తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది.

యుద్ధ విరామం ప్రకటించిన ట్రంప్: ఇరాన్ – అమెరికా మధ్య గత నెల 28న ప్రారంభమైన యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆగ్రహం చెందిన ఇరాన్, అమెరికాపై పగ తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసి దాడులను ఉధృతం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి వర్షం కురిపించింది. ఖతార్, బహ్రెయిన్, దుబాయ్‌లలో ఈ దాడులు జరిగాయి. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌ను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థల కళ్లుగప్పి ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.

ఈ యుద్ధం మూడు వారాలు దాటడంతో అంతర్జాతీయంగా పెను ప్రభావం చూపింది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇంధన కొరత ఏర్పడింది. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన ట్రంప్, అనూహ్యంగా నేడు 5 రోజుల యుద్ధ విరామాన్ని ప్రకటించారు.

వెంటనే ఖండించిన ఇరాన్: గత రెండు రోజులుగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ట్రంప్ చెప్పిన మాటలను ఇరాన్ తోసిపుచ్చింది. “ఒకవేళ అమెరికా ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడి చేస్తే, మేము మొత్తం ప్రాంతంలోని ఇంధన వ్యవస్థలను ధ్వంసం చేస్తామని హెచ్చరించాం. ఆ భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గి, దాడులను వాయిదా వేయమని తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు” అని ఇరాన్ పేర్కొంది.

చర్చలు జరగలేదు: అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘ప్రెస్ టీవీ’ వెల్లడించింది. ఇరాన్ రక్షణ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “ఇరాన్ సైనిక హెచ్చరికలు మరియు యుద్ధం వల్ల అమెరికా, పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్చల వల్ల కాదు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి లేదా మార్కెట్‌ను స్థిరీకరించడానికి ఇటువంటి సైకలాజికల్ వార్ (మానసిక యుద్ధం) పనికిరాదు” అని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: