ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో, అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక: ఇంతకుముందు బంగారం జోలికి వెళ్ళని లేదా చాలా కాలంగా కొనుగోలు చేయని కేంద్ర బ్యాంకులు కూడా ఇప్పుడు మళ్ళీ బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభించాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ప్రపంచ నిల్వల (Reserves) విధానంలో ఒక పెద్ద మార్పు వస్తోందని, అందులో భాగంగా బంగారానికి ప్రాముఖ్యత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే (De-dollarization) దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
కొత్త దేశాల రాక: WGC అధికారి షాకాయ్ ఫాన్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలల్లో కొత్త దేశాలు గోల్డ్ మార్కెట్లోకి రావడం గమనార్హం అని తెలిపారు. ముఖ్యంగా గ్వాటెమాలా, ఇండోనేషియా మరియు మలేషియా వంటి దేశాలు సుదీర్ఘ విరామం తర్వాత లేదా మొదటిసారిగా బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాయి. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ధరల్లో మార్పులు: బంగారం ధరల్లో ఇటీవల భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఒక ట్రాయ్ ఔన్స్ (Troy Ounce) బంగారం ధర సుమారు 1,000 డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ ధర దాదాపు 4,340 డాలర్ల వద్ద ఉంది. గత జనవరి చివరలో ఇది 5,600 డాలర్ల చారిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది.
తగ్గుతున్న కొనుగోళ్లు? 2025లో కేంద్ర బ్యాంకులు దాదాపు 863 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2026లో ఇది 850 మెట్రిక్ టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా కొనాలనే ఆసక్తి కొంత మందగించవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, 2022 కంటే ముందున్న పరిస్థితులతో పోలిస్తే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇంకా ఎక్కువే ఉన్నాయని WGC తెలిపింది.
