న్యూఢిల్లీ: ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కాశ్మీర్ ప్రజలు విరాళాలు సేకరించి అండగా నిలిచారు. ఈ క్రమంలో భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం (Embassy) కాశ్మీర్ మరియు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా (X) ఒక పోస్ట్ పెట్టింది. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
ట్వీట్ తొలగింపు వివాదం: పాకిస్థాన్‌కు చెందిన ట్రోలర్లు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. “కాశ్మీర్ భారత్‌లో భాగం కాదు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరంగా, ఇరాన్ రాయబార కార్యాలయం ఆ ట్రోల్స్‌కు లొంగిపోయి, భారత్ మరియు కాశ్మీర్ పేర్లను ప్రస్తావించిన ఆ ట్వీట్‌ను తొలగించింది.
తొలగించిన ట్వీట్లో ఏముంది? “28 ఏళ్ల క్రితం మరణించిన తన భర్త జ్ఞాపకార్థం దాచుకున్న బంగారాన్ని ఒక సోదరి ఇరాన్ ప్రజల కోసం విరాళంగా ఇచ్చారు. మీ కన్నీళ్లు, మీ ప్రేమను ఇరాన్ ఎన్నటికీ మర్చిపోదు. ధన్యవాదాలు కాశ్మీర్.. ధన్యవాదాలు భారత్” అని ఆ పోస్ట్‌లో ఉంది. కానీ పాకిస్థానీల ఒత్తిడితో ఈ పోస్ట్‌ను తొలగించి, ఆ తర్వాత భారత్ పేరు లేకుండా కేవలం విరాళం వీడియోను మాత్రమే మళ్లీ పోస్ట్ చేశారు.
డబ్బు కావాలి కానీ.. మద్దతు వద్దా? ఇరాన్ రాయబార కార్యాలయం విరాళాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో కొత్త ఖాతా తెరిచి, క్యూఆర్ (QR) కోడ్‌ను కూడా షేర్ చేసింది. భారతీయుల నుండి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడుతున్న ఇరాన్, భారత సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి మాత్రం వెనకాడుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇరాన్ మరియు టర్కీ వంటి దేశాలు భారత్‌తో వ్యాపారం కోరుకుంటాయి కానీ, కీలక విషయాల్లో భారత్‌కు మద్దతు ఇవ్వవని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ స్పందన: మధ్యప్రాచ్య సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్ వైఖరి మొదటి నుండి స్పష్టంగా ఉందని తెలిపారు. దాడులను ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ‘హోర్ముజ్ జలసంధి’ వంటి అంతర్జాతీయ జలమార్గాలలో వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణంలో కూడా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.
