న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ ఈ సీజన్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన అంతర్జాతీయ కెరీర్‌ను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆయన ఐపీఎల్లో 3 ఏళ్ల నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెన్ డకెట్‌ను వేలంలో ₹2 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఆయన ఓపెనింగ్‌లో కీలక పాత్ర పోషిస్తారని జట్టు యాజమాన్యం ఆశించింది. కానీ టోర్నీ మొదలవడానికి కొద్దిరోజుల ముందే ఆయన తప్పుకోవడంతో ఢిల్లీ వ్యూహాలు దెబ్బతిన్నాయి.
ఢిల్లీ జట్టుకు క్షమాపణలు: తన నిర్ణయంపై ‘ది టెలిగ్రాఫ్’ పత్రికతో బెన్ డకెట్ మాట్లాడుతూ.. “ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఢిల్లీ జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను. వేలంలో నా పేరు ఇచ్చినప్పుడు ఇదొక గొప్ప అవకాశం అని భావించాను. ఢిల్లీ లాంటి జట్టు నన్ను ఎంచుకోవడం చాలా ప్రత్యేకం. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్, అక్కడ ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది” అని పేర్కొన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “నాకు ఇప్పుడు 31 ఏళ్లు, తిరిగి రావడం అంత సులభం కాదు. కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఆశిస్తున్నాను. నా కెరీర్ దృష్ట్యా ఈ సమయంలో ఇదే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను” అని తెలిపారు.
ఇంగ్లాండ్ జట్టు కోసం లీగ్‌కు దూరం: ప్రస్తుతం బెన్ డకెట్ ఇంగ్లాండ్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో వరుస అవకాశాల కోసం ఆయన ఫ్రాంచైజీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. చివరి నిమిషంలో పేరు వెనక్కి తీసుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల డకెట్పై మూడేళ్ల పాటు ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించవచ్చు, ఇది ఆయన టీ20 కెరీర్‌కు పెద్ద దెబ్బ కానుంది.
