సముద్రపు లోతుల్లో బయటపడ్డ నల్లటి గుడ్లు: తెరిచి చూసిన పరిశోధకులకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్!

ఈ ప్రపంచం ఎన్నో రహస్యాల నిలయం. అంతరిక్షం గురించి మనిషి ఎంతో తెలుసుకున్నప్పటికీ, భూమిపై ఉన్న సముద్రాల లోతుల్లో ఏముందో ఇప్పటికీ పూర్తిగా కనుగొనలేకపోయాడు. సముద్ర గర్భంలో మనం ఊహించని వింత లోకం ఒకటి దాగి ఉంది. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు పెసిఫిక్ మహాసముద్రం అడుగున కనుగొన్న ఒక వింత జీవి ఇప్పుడు సైన్స్ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పెసిఫిక్ సముద్రంలో నల్లటి గుడ్లు: జపాన్‌లోని టోక్యో మరియు హొక్కైడో విశ్వవిద్యాలయ పరిశోధకులు పెసిఫిక్ మహాసముద్రంలో రోబోటిక్ పరికరాలతో పరిశోధనలు చేశారు. సుమారు 6,200 మీటర్ల లోతులో, ఒక పెద్ద బండరాయికి అంటుకుని ఉన్న కొన్ని నల్లటి గుడ్లను వారు గుర్తించారు. ఇవి కేవలం 3 మిల్లీమీటర్ల వెడల్పు ఉండి, చూడటానికి హాలీవుడ్ సినిమాల్లోని ‘ఏలియన్ గుడ్ల’ లాగే వింతగా ఉన్నాయి.

ఓపెన్ చేసినప్పుడు ఏం కనిపించింది? ఈ నల్లటి వస్తువులు ఏంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక రోబోటిక్ చేయి సాయంతో ఒక గుడ్డును పగలగొట్టారు. ఆ సమయంలో అందులో నుండి పాలు వంటి తెల్లటి ద్రవం బయటకు వచ్చింది. దాని లోపల చిన్న చిన్న జీవులు కనిపించి నీటిలో కలిసిపోయాయి. మొదట అవి ఏంటో అర్థం కానప్పటికీ, మరింత లోతుగా పరిశీలించగా అవి గుడ్లు కావని, కొన్ని జీవుల ‘గూళ్లు’ అని తేలింది.

అవి ఫ్లాట్‌వార్మ్స్ (చప్పట పురుగులు): ఆ గూళ్లలో ఉన్న జీవులు ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్త రకం ఫ్లాట్‌వార్మ్స్ (Flatworms). సాధారణంగా ఇవి తీర ప్రాంతాల్లోని రాళ్లకు అంటుకుని ఉంటాయి. కానీ, సముద్రం లోపల 6,000 మీటర్ల లోతులో, ఇంతటి భారీ ఒత్తిడిని తట్టుకుని ఇవి గూళ్లు నిర్మించుకోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సముద్రంలోని కఠినమైన రసాయన వాతావరణం నుండి తమ భ్రూణాలను (Embryos) కాపాడుకోవడానికి ఇవి ఇలాంటి నల్లటి గోళాకార గూళ్లను నిర్మించుకుంటాయని తేలింది.

శాస్త్రవేత్తల విశ్లేషణ: DNA పరీక్షల ద్వారా ఈ జీవులు ‘ప్లాటిహెల్మింతెస్’ (Platyhelminthes) అనే వర్గానికి చెందిన కొత్త జాతి అని తెలిసింది. వేల ఏళ్ల క్రితం తీర ప్రాంతాల్లో ఉండే ఈ జీవులు, సముద్రపు లోతుల్లోకి ఎలా వలస వెళ్లాయి? అక్కడ ఎలా మనుగడ సాగిస్తున్నాయి? అనే అంశాలపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఇంత లోతులో ఒక జీవి యొక్క భ్రూణ దశను గుర్తించడం చరిత్రలో ఇదే మొదటిసారి.


Posted

in

by

Tags: