టెహ్రాన్: ఇరాన్‌పై దాడులను ఒక నెల రోజుల పాటు నిలిపివేసేందుకు అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. డొనాల్డ్ ట్రంప్ తమకు ఆదేశాలు జారీ చేయలేరని, తాము విధించిన నిబంధనలు నెరవేరితేనే యుద్ధం ముగుస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది.
నేపథ్యం: గత నెల 28న మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు మరణించడంతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది.
మా నిబంధనలు చెల్లిస్తేనే: ఖమేనీ మరణంతో ఇరాన్ లొంగిపోతుందని అమెరికా ఆశించినప్పటికీ, ఫలితం భిన్నంగా ఉంది. ఇరాన్ వెనక్కి తగ్గకుండా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులు కొనసాగిస్తోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలను తన గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేసింది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా 5 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు.
యుద్ధాన్ని పూర్తిగా ఆపేందుకు అమెరికా 15 అంశాల ప్రణాళికను ముందుంచింది. అయితే, అమెరికా పెట్టిన గడువును, నిబంధనలను ఇరాన్ తోసిపుచ్చింది. తమ షరతులకు అంగీకరిస్తేనే దాడులు ఆపుతామని ఇరాన్ ప్రభుత్వ ఛానల్ ‘ప్రెస్ టీవీ’ వెల్లడించింది.
ఇరాన్ పెట్టిన ప్రధాన నిబంధనలు ఇవే: యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో నిర్ణయించే అధికారం కేవలం ఇరాన్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేస్తూ, ఈ క్రింది డిమాండ్లను ఉంచింది:
- హార్ముజ్ జలసంధి: హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఉన్న సార్వభౌమత్వాన్ని, హక్కులను గుర్తించాలి.
- నష్టపరిహారం: యుద్ధం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలి.
- గ్యారెంటీ: భవిష్యత్తులో మళ్లీ దాడులు చేయబోమని గ్యారెంటీ ఇవ్వాలి.
- ప్రాంతీయ శాంతి: కేవలం ఇరాన్‌పైనే కాకుండా, ఈ ప్రాంతంలోని ఇతర మిత్ర దేశాల (రెసిస్టెన్స్ గ్రూపులు) పై కూడా దాడులు పూర్తిగా ఆపివేయాలి.
ఈ నిబంధనలన్నీ నెరవేరే వరకు తమ రక్షణ చర్యలు (దాడులు) కొనసాగుతాయని ఇరాన్ హెచ్చరించింది.
