ఈ దేశంలో గాంధీజీని ‘మహాత్మా’ అని గౌరవిస్తారు. విదేశీ ప్రతినిధులు ఎవరు భారత్‌కు వచ్చినా, ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వెళ్ళి గాంధీజీ సమాధిపై పూలు చల్లి నివాళులర్పిస్తారు. ఆ తర్వాతే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ, అంతటి గౌరవం ఇచ్చే గాంధీజీ విగ్రహం పట్ల కొందరు యువకులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన: ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, రాంపూర్ గార్డెన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ కొందరు యువకులు మహాత్మా గాంధీ విగ్రహం పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. ఆ యువకులు గాంధీజీ విగ్రహంపైకి ఎక్కి, విగ్రహం చెవులు, పెదాలను తాకుతూ అసభ్యకరమైన చేష్టలు చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న వ్వవహారం: విదేశాల్లో గాంధీజీ విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా హాని కలిగించడం వంటి ఘటనలు గతంలో చూశాం. కానీ ఈసారి దేశం లోపలే కొందరు యువకులు ఇటువంటి సిగ్గుచేటు చర్యకు పాల్పడటమే కాకుండా, దానిని వీడియో తీసి నవ్వుకోవడం చర్చనీయాంశమైంది. వీడియోలో కనిపిస్తున్న యువకులు ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారిలా కనిపిస్తుండటంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది.
కాంగ్రెస్ నేతలపై ప్రశ్నల వర్షం: గాంధీజీ ఏ వర్గానికైతే ఎంతో గౌరవం ఇచ్చారో, అదే వర్గానికి చెందిన యువకులు ఇలా చేయడం సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్లు రాస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏమంటారని, ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “వీడియో ఇంత వైరల్ అయినా అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అదే వేరే ఎవరైనా ఇలాంటి పని చేసి ఉంటే ఈపాటికి దేశవ్యాప్తంగా రచ్చ జరిగేది కదా” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
