వాషింగ్టన్: ప్రపంచంలో తనకంటే గొప్పగా చర్చలు జరిపే వ్యక్తి మరొకరు లేరని డొనాల్డ్ ట్రంప్ తరచుగా చెబుతుంటారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
అంటే, “ఇరాన్ అగ్రనేతగా నన్ను బాధ్యతలు చేపట్టమని వారు అడిగారు.. నేనే వద్దని చెప్పాను” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ట్రంప్ అసలేమన్నారు? “ఇరాన్ నాయకులు నాతో చర్చలు జరపాలని చాలా ఆశపడుతున్నారు. కానీ ప్రజలు తమను చంపేస్తారనే భయంతో ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. వారు నా దగ్గరకు వచ్చి, ‘మిమ్మల్ని మా తదుపరి సుప్రీం లీడర్‌గా మార్చేస్తాం’ అని కూడా చెప్పారు. కానీ, నాకు ఆ పని వద్దు, ధన్యవాదాలు అని నేను చెప్పేశాను” అని ట్రంప్ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి!
ట్రంప్ ‘అతి’శయోక్తులు: ట్రంప్ ఏం మాట్లాడినా అది అంతర్జాతీయ స్థాయిలో ‘ట్రోల్ మెటీరియల్’గా మారిపోతుంది. ఈ సుప్రీం లీడర్ వ్యాఖ్యలు కూడా అలాగే మారాయి. ఎవరైనా తమ శత్రు దేశాధినేతను తమ దేశానికి నాయకుడిగా ఉండమని కోరుకుంటారా? అలా కోరుకున్నారని చెప్పడమే కాకుండా, ప్రజలకు భయపడి ఇరాన్ నేతలు దాస్తున్నారని ట్రంప్ నమ్మబలుకుతున్నారు.
ఇరాన్ ప్రజల స్థితిగతులపై వైఖరి: ట్రంప్ మాటల ప్రకారం చూస్తే.. ఇరాన్ ప్రజలు ఇప్పటికీ ఖమేనీ నాయకత్వంలోని పాలననే కోరుకుంటున్నారని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! మరి అలాంటప్పుడు ఇరాన్‌లో ప్రజాస్వామ్యం రావాలని, పాలన మారాలని దాడులు చేయడం ఎందుకు? అనే లాజికల్ ప్రశ్న ఉదయిస్తోంది. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న కారణం ఇదే – “ఇరాన్ ప్రజలు చాలా వేదన అనుభవిస్తున్నారు, వారికి స్వేచ్ఛను ఇస్తాం” అని.
ఇరాన్ సెటైర్లు: ఒకవైపు పాలన మారాలని చెప్పడం, మరోవైపు మార్పు వస్తే ప్రజలు అంగీకరించరని అనడం విడ్డూరంగా ఉంది. మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో తన చేయి పైచేయిగా ఉండాలనే అమెరికా ఈ దాడులు చేస్తోందని అర్థమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. “ట్రంప్ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు ఉన్నారు” అంటూ ఎగతాళి చేసింది.
