డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని శ్రీ గురు రామ్ రాయ్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ తన్వి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు పలు మలుపులు తిరుగుతోంది.
తన్వి మరణించడానికి ముందు తన విభాగపు అధిపతి (HOD) తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను తన తండ్రికి పంపడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సుమారు అరగంట నిడివి ఉన్న ఆ ఆడియోలో, తన్వి తన హెచ్ఓడి డాక్టర్ ప్రియాంక గుప్తాతో చాలా ఆవేదనగా మాట్లాడటం వినిపిస్తోంది. “మేడమ్, నేను ఇంకెంతమందిని సంతృప్తి పరచాలి? నేనింకా ఏం చేయగలను? నేనే తప్పూ చేయలేదు. ఒకరోజు గందరగోళం వల్లే క్లాస్‌కు రాలేకపోయాను, అంతకు మించి నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు” అంటూ తన్వి ఏడుస్తూ చెప్పడం ఆ ఆడియోలో ఉంది.
అంబాలాకు చెందిన తన్వి తండ్రి డాక్టర్ లలిత్ మోహన్ కన్నీటితో మాట్లాడుతూ.. “మార్చి 24వ తేదీ రాత్రి 9 గంటలకు తన్వి నాతో గంటసేపు మాట్లాడింది. తను తీవ్ర మనస్తాపంలో ఉంది. నేను ఆమెను ఓదార్చి, మరుసటి రోజు నేరుగా వస్తానని చెప్పాను. కానీ, అర్ధరాత్రి 2:30 గంటలకు నేను డెహ్రాడూన్ వచ్చి చూసేసరికి, పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉంచిన కారులో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. కారు అద్దాలు పగులగొట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం, కానీ అప్పటికే తను చనిపోయింది” అని తెలిపారు.
కాలేజీ యాజమాన్యం వెర్షన్: ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు రాసిన లేఖలో కొన్ని కీలక అంశాలను పేర్కొంది. తన్వి గత రెండేళ్లుగా మానసిక సమస్యలకు చికిత్స పొందుతోందని, గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపింది. హెచ్ఓడి మరియు విద్యార్థిని మధ్య సత్సంబంధాలే ఉన్నాయని, ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఎవరూ ప్రవర్తించలేదని, వాస్తవాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరపాలని యాజమాన్యం కోరింది.
పోలీసుల విచారణ: సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర సింగ్ దోబాల్ మాట్లాడుతూ.. “ఇది చాలా సున్నితమైన కేసు. విద్యార్థిని వైద్య రికార్డులను పరిశీలించడానికి మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తాం. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె విషం తీసుకున్నట్లు తేలింది. సిసిటివి ఫుటేజ్ మరియు సెల్ ఫోన్ రికార్డులను విశ్లేషిస్తున్నాం” అని తెలిపారు.
