పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభమైన మొదటి రోజే ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత మ్యాచ్‌లో ఉపయోగించిన జెర్సీలు మరియు బంతి నాణ్యతపై అభిమానులు సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు.
లాహోర్ ఖలందర్స్ మరియు హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఉపయోగించిన తెల్లటి బంతి, ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఎర్రగా మారిపోయింది. ఈ దృశ్యం చూసి ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అజబ్-గజబ్ ఘటన
లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆట ప్రారంభమైన కొన్ని ఓవర్లకే బంతి రంగు నెమ్మదిగా మారడం మొదలైంది. తెల్లటి బంతి ఎర్రగా మారడం చూసి హైదరాబాద్ టీమ్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ వెంటనే అంపైర్ వద్దకు వెళ్లారు. “రెండో ఓవర్ ముగియగానే నేను అంపైర్ దగ్గరకు వెళ్లి.. ఇక్కడ ఏం జరుగుతోంది? బంతి ఎందుకు ఎర్రగా మారుతోంది? అని అడిగాను. నా క్రికెట్ కెరీర్లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” అని లబుషేన్ పేర్కొన్నారు.
బంతి రంగు ఎందుకు మారింది?
ఆ తర్వాత బంతి రంగు మారడం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. నిజానికి హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్లు ధరించిన మెరూన్ రంగు జెర్సీ రంగు బంతికి అంటుకుంది. ఆటగాళ్లు బంతిని మెరిపించడానికి (Polish) తమ జెర్సీకి రుద్దినప్పుడు, జెర్సీ రంగు బంతికి తగిలి అది ఎర్రగా మారింది. “బ్యాట్ పెయింట్ లేదా ప్యాడ్ రంగు బంతికి అంటుకోవడం చూశాను కానీ, బట్టల రంగు బంతికి అంటడం ఇదే మొదటిసారి” అని లబుషేన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పీఎస్ఎల్లో కొత్త నియమం
జెర్సీ నాణ్యతతో పాటు, ఈసారి PSLలో ప్రవేశపెట్టిన ఒక కొత్త రూల్ కూడా చర్చనీయాంశమైంది. ఉపఖండంలో రాత్రి పూట జరిగే మ్యాచ్‌లలో ‘మంచు’ (Dew) ప్రభావం టాస్ గెలిచిన జట్టుకు ఎక్కువ లాభం చేకూరుస్తుంది. దీనిని అరికట్టడానికి, ప్రతి జట్టు టాస్కు ముందు రెండు వేర్వేరు ప్లేయింగ్ ఎలెవన్ (Playing 11) జాబితాలను సమర్పించడానికి అనుమతించారు. టాస్ ఫలితం వచ్చిన తర్వాత, కెప్టెన్ తన అవసరానికి తగ్గట్టుగా ఒక జట్టును ఎంచుకోవచ్చు. మంచు వల్ల బౌలర్లకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
