రష్యా పెట్రోల్ ఎగుమతుల నిషేధం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇంధన మార్కెట్లో అలజడి మొదలైంది. ఈ తరుణంలో రష్యా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ఏప్రిల్ 1, 2026 నుండి పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
తమ దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను పెంచడం మరియు ధరలను అదుపులో ఉంచడమే ఈ నిర్ణయం వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం. అయితే, రష్యా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లో ఆందోళన కలిగించవచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు, భారత్ రష్యా నుండి దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు ఎగుమతులపై నిషేధం విధిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
అయితే, భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ మరియు ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రాబోయే రెండు నెలల వరకు ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేసింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి కూడా 20 శాతం పెరిగిందని వెల్లడించింది.
రష్యా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా ఇంధన ధరలు అంచనాల కంటే పెరగకూడదని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. రష్యా ఇంధన శాఖ ప్రకారం.. తమ రిఫైనింగ్ సామర్థ్యం బలంగా ఉందని, దేశీయ డిమాండ్‌ను తీర్చడానికే ఎగుమతులపై నిషేధాన్ని ప్రాధాన్యతగా ఎంచుకున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం
పశ్చిమ ఆసియాలో సాగుతున్న ఘర్షణల వల్ల ఇప్పటికే ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. రష్యా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా తగ్గి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ దీనిపై స్పందిస్తూ.. తాము అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, దేశీయంగా ఎటువంటి సంక్షోభం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చింది.
