మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో, తమకు అత్యంత సన్నిహిత దేశమైన చైనాకు చెందిన సరుకు రవాణా నౌకలనే ఇరాన్ వెనక్కి పంపడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
చైనాకు చెందిన అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ ‘కోస్కో’ (COSCO)కి చెందిన రెండు భారీ సరుకు రవాణా నౌకలు హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా, భద్రతా హామీ లేకపోవడంతో అవి సగం నుండే ‘యూ-టర్న్’ తీసుకుని వెనుదిరిగాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న లేదా వాటికి మద్దతు ఇచ్చే దేశాలకు వెళ్లే ఏ నౌకనైనా ఈ సముద్ర మార్గం ద్వారా వెళ్లడానికి అనుమతించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టంగా ప్రకటించింది.
మరోవైపు, ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తన నిబంధనలకు కట్టుబడి ఉంది. అంతేకాకుండా, అమెరికా సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుండి ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
కువైట్ వంటి పొరుగు దేశాల వాణిజ్య ఓడరేవులపై డ్రోన్ దాడులు జరుగుతుండటంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
