కేవలం పట్టణ నాగరికతలో, మెరుపుల మధ్య నివసించాలనే కోరికతో వృద్ధాప్యంలో భర్తను వదిలిపెట్టిన భార్యకు భరణం (Maintenance) ఇవ్వనక్కరలేదని బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే తీర్పునిచ్చారు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సవిత మరియు రమేష్ (పేర్లు మార్చబడ్డాయి) దంపతులు వివాహం తర్వాత 34 ఏళ్ల పాటు యావత్మాల్లో కలిసి నివసించారు. రమేష్ జిల్లా పరిషత్‌లో ఉద్యోగిగా పనిచేసి జూన్ 2018లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తన సొంత గ్రామానికి వెళ్లి నివసించాలని నిర్ణయించుకున్నారు. కానీ, సవితకు పల్లెటూరికి వెళ్లడం ఇష్టం లేదు. అందుకే ఆమె తన ఇద్దరు ఎదిగిన కొడుకులతో కలిసి యావత్మాల్లోనే ఉండిపోయారు. అనంతరం భరణం కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
ఫ్యామిలీ కోర్టు మార్చి 1, 2023న ఆమె దరఖాస్తును తిరస్కరించడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా ఆమెను భరణానికి అనర్హురాలిగా తేల్చింది. మూడు దశాబ్దాల సహజీవన కాలంలో సవిత ఎప్పుడూ రమేష్ ప్రవర్తనపై ఫిర్యాదు చేయలేదని కోర్టు గమనించింది.
ఆమె రమేష్‌పై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, రమేష్ ఆమెను తనతో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆమెకే గ్రామంలో ఉండటం ఇష్టం లేదని కోర్టు పేర్కొంది. ఎటువంటి బలమైన కారణం లేకుండా భర్తను వదిలిపెట్టినందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ దంపతులకు మే 15, 1985న వివాహం జరిగింది.
భార్య చేసిన ఆరోపణలు ఇవే:
పెళ్లయినప్పటి నుండి రమేష్ చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారని, మద్యం మత్తులో దూషిస్తూ కొట్టేవారని సవిత ఆరోపించారు. ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన ప్రవర్తన మారలేదని, ప్రస్తుతం ఆయన మరో మహిళతో కలిసి ఉంటున్నారని ఆమె వాదించారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె ఎలాంటి పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు.
